TDP-Janasena ఉమ్మడి పోరు గుంతల ఏపీకి దారేది?..

TDP-Janasena ఉమ్మడి పోరు  గుంతల ఏపీకి దారేది?..
టీడీపీ-జనసేన నిరసన పిలుపునకు అనూహ్య స్పందన

నాలుగున్నరేళ్ల జగన్‌ ప్రభుత్వ పాలనలో రాష్ర్టంలోని రహదారులన్నీ అధ్వానంగా తయారయ్యాయని తెలుగుదేశం-జనసేన నేతలు మండిపడ్డారు. గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది పేరుతో... రాష్ట్ర వ్యాప్తంగా ఇరుపార్టీ నాయకులు రెండురోజుల ఆందోళనల్లో భాగంగా మొదటిరోజు కదం తొక్కారు. జగన్‌ అసమర్థ పాలనతో రోడ్డుపై ప్రయాణమంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పలుచోట్ల నేతలు శ్రమదానం చేసి రోడ్లు బాగు చేశారు.

గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది పేరుతో తెలుగుదేశం-జనసేన నేతలు రాష్ర్టవ్యాప్తంగా ఆందోళనలతో హోరెత్తించారు. నెల్లూరు జిల్లా రాజంపేట రహదారిలోని గుంతల రోడ్లపై ఆందోళన చేశారు. పాడైన రోడ్ల కారణంగా ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయో ప్రజలకు వివరించారు. అనంతపురం నుంచి తగరకుంటకు వెళ్లే రహదారిని మాజీ మంత్రి పరిటాల సునీత, జనసేన నాయకులు పరిశీలించారు. ఎమ్మెల్యే తోపుదుర్తి తన సొంత గ్రామానికీ రోడ్డు వేయించుకోలేని దుస్థితిలో ఉన్నారంటూ విమర్శించారు. రోడ్లు అధ్వాన స్థితిపై ప్రయాణికులతో మాట్లాడి సమస్యల్ని తెలుసుకున్నారు.


అధ్వాన్న రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేస్తూ.. కాకినాడ నగరం, గ్రామీణ నియోజకవర్గాల్లో నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇంద్రపాలెం నుంచి కొవ్వాడ వెళ్లే రహదారిపై గోతులను శ్రమదానం చేసి పూడ్చారు. ఏలూరి జిల్లా గుంటుపల్లిలో చిధ్రమైన రోడ్లపై నేతలు ఆందోళన చేశారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలోని గుంతలను మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు, జనసేన నేతలు శ్రమదానం చేసి పూడ్చారు. విశాఖ జిల్లా రామవరంలో నాయకులు నిరసన చేపట్టారు. విజయనగరం జిల్లా రాజాం భారీ ర్యాలీ నిర్వహించారు. గుంతల్లో పడవలు వదిలి వినూత్న రీతిలో నిరసన తెలిపాయి.

కృష్ణా జిల్లా గన్నవరంలోని బాపులుపాడు మండలంలో ప్రమాదకరంగా మారిన ఆర్ అండ్ బి రహదారిపై నాయకులు నిరసన తెలిపారు. కోడూరు మండలం మాచవరం నుంచి చిరువోల్లంక ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. బాహుబలి సినిమాలో వెండితెరపై కుంతల రాజ్యాన్ని చూశామని... జగన్‌ అంకుల్‌ పాలనలో మాత్రం నిజ జీవితంలో ‘గుంతల రాజ్యాన్ని’ చూస్తున్నామని గతంలో నారా లోకేశ్‌ ఆరోపించారు. రహదారులపై ఏకంగా లారీలే పడిపోయేంత పెద్దవని... కొత్త రోడ్లు వేయలేదు సరికదా వాటిపై గుంతలను కూడా పూడ్చలేని అసమర్థ పాలన జగన్‌దని లోకేశ్‌ మండిపడ్డారు. నిత్యం ఇక్కట్లు పడుతున్న జనం నిరసనలకు దిగుతున్నారని.... అయినా జగన్‌ అంకుల్‌కి ఉలుకూ పలుకు లేదని ఎద్దేవా చేశారు. 2020 జులై 15 నాటికి గుంతలు లేని రోడ్లను చూపిస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించారని.. 2023 జులై 15 వెళ్లినా ఇంతవరకు ఒక్క గుంత పూడ్చలేదని మండిపడ్డారు.


Tags

Next Story