MEET: నేడే టీడీపీ-జనసేన తొలి భేటీ

MEET: నేడే టీడీపీ-జనసేన తొలి భేటీ
X
ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం.... ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చ

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనను వేగవంతం చేశాయి. ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు సభ్యులతో ఏర్పాటైన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం నేడు జరగనుంది. సంక్షేమం, అభివృద్ధే ప్రధాన ఎజెండాగా త్వరలో ఉమ్మడిగా మేనిఫెస్టోను ప్రకటించనున్నాయి. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం NTR భవన్‌ వేదికగా ఈ మధ్యాహ్నం తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి మ్యానిఫెస్టో కమిటీ తొలి సమావేశం జరగనుంది. ఈ కమిటీలో టీడీపీ నుంచి సీనియర్‌ నేత మాజీమంత్రి యనమల రామకృష్ణుడు, MLCఅశోక్ బాబు, పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ సభ్యులుగా ఉన్నారు. జనసేన నుంచి జనవాణి సమన్వయకర్త వరప్రసాద్, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ముత్తా శశిధర్, అధికార ప్రతినిధి శరత్ కుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికలకు ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలపై ఈ కమిటీ కసరత్తు చేయనుంది. టీడీపీ ఇప్పటికే రాజమహేంద్రవరం మహానాడులో 'సూపర్ సిక్స్' పేరుతో మిని మేనిఫెస్టోగా ఆరు కార్యక్రమాలను ప్రకటించింది. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ గత ఏడాది ఇప్పటంలో జరిగిన బహిరంగ సభలో షణ్ముఖ వ్యూహం పేరుతో మేనిఫెస్టో ప్రకటిస్తామని వెల్లడించారు.


తెలుగుదేశం ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ అంశాల్లో మహిళల, యువత, బీసీ, రైతు, పేదలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మహాశక్తి పేరిట ఆడబిడ్డలకు ప్రత్యేక నిధి, 18ఏళ్ల నిండిన ప్రతి మహిళల ఖాతాల్లో నెలకు 1500 రూపాయలు, తల్లికి వందనం పేరుతో ప్రతీబిడ్డా చదువుకునేందుకు ఇంట్లో ఎంత మంది ఉన్నా ప్రతి ఒక్కరికి ఏటా 15వేల రూపాయలు ఇస్తామమని ప్రకటించారు. స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉండరాదనే నిబంధనను తొలగించాలని నిర్ణయించారు. దీపం పథకం కింద ఏటా 3సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మిని మేనిఫెస్టోలో పొందుపరించారు. అవసరమైతే నాలుగో సిలిండర్‌ కూడా ఇస్తామని చంద్రబాబు వెల్లడించారు. మహిళలందరికీ జిల్లాల పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని యువత కోసం యువగళం మేనిఫెస్టోలో ప్రతి నిరుద్యోగ యువతకు నెలకు 3వేల నిరుద్యోగ భృతి, ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాల హామీని ప్రకటించారు. రైతులకు ఏటా 20వేల రూపాయలు ఆర్థిక సాయం, బీసీలకు ప్రత్యేకరక్షణ చట్టం, ప్రతి ఇంటికి కుళాయి క0నెక్షన్, పూర్ టు రిచ్ పేరిట ప్రతి పేదవాడిని ధనికుడిని చేసేలా ప్రత్యేక కార్యాచరణను తెలుగుదేశం ప్రకటించింది.


ఇటీవల హైదరాబాద్‌లో చంద్రబాబుతో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సమావేశమయినప్పుడు షణ్ముఖ వ్యూహం పేరిట 6 అంశాలు ప్రతిపాదించారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ విశాఖ, తిరుపతి, విజయవాడలను క్లస్టర్ల వారీగా మహా నగరాలుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. జనసేన తెలుగుదేశం మినీ మెనిఫెస్టోలో ఇప్పటికే కొన్ని ఉమ్మడి అంశాలు ఉన్నందున వాటికి అదనంగా మరికొన్ని జోడించి కమిటీ తుది మేనిఫెస్టో ను రూపొందించనుంది. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఏకాభిప్రాయంతో ఖరారు చేసి త్వరలోనే ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తారు.

Tags

Next Story