TDP: సంగం డెయిరీని దెబ్బతీసే కుట్ర

TDP: సంగం డెయిరీని దెబ్బతీసే కుట్ర
జగన్‌రెడ్డి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్న టీడీపీ.... సంస్థ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆవేదన

సంగం డెయిరీని దెబ్బతీసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రోజుకో కుట్రపన్నుతోందని ఆ సంస్థ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ఈ నెల 15న తనపై నమోదైన కేసు విషయంలోనూసీఎం కార్యాలయం సాక్షిగా కుట్ర జరిగిందన్నారు. పాడి రైతుల ముసుగులో కొందరు వ్యక్తులు డెయిరీ వద్ద గొడవకు దిగారని.. సంస్థ ప్రతిష్ఠకు భంగం చేకూర్చేలా వ్యవహరించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


మరోవైపు తెరముందు తమ్ముడు, తెర వెనుక అన్న అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ లో ఇసుక దోపిడీకి సీఎం జగన్ తెర లేపారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు అన్నారు. ముఖ్యమంత్రి పేషీ ఆధ్వర్యంలో జరిగే ఇసుక కుంభకోణంలో తెర ముందు ముఖ్యమంత్రి సోదరుడు అనిల్ ఉంటే.... తెర వెనుక జగన్ ఉన్నట్టు ఆరోపించారు. వైకాపా నాలుగున్నరేళ్ల పాలనలో సాగిన ఇసుక దోపిడీ ఒక ఎత్తైతే..., వచ్చే 6నెలలు సాగే దోపిడీ మరో ఎత్తని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 29.5లక్షల రూపాయల ధర నిర్ణయించడం..... దోపిడీ కాక మరేంటని నక్కాఆనంద్ బాబు నిలదీశారు.

ఆంధ్రప్రదేశ్‌లో సర్పంచుల రెండో దశ ఉద్యమం చేపట్టనున్నట్లు పంచాయతీరాజ్‍ చాంబర్‍ రాష్ట్ర వ్యవస్ధాపక అధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్‍ తెలిపారు. తిరుపతిలో ఏపీ సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్‍ ఛాంబర్ నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశాల్లో..ఆయన పాల్గొన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థను జగన్ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందని బాబు రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు. కేంద్ర ఇస్తున్న నిధులను దారిమళ్లించారని..తిరుపతి వస్తున్న ప్రధాని మోదీ దీనిపై ముఖ్యమంత్రిని జగన్ ప్రశ్నించాలని కోరారు.


వైసీపీ అధికారంలోకి వచ్చాక ముస్లింలకు తీరని అన్యాయం జరుగుతోందని టీడీపీ మైనార్టీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముక్తార్ అహ్మద్ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నిర్వహించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి మైనార్టీ సదస్సులో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌ మైనారిటీ కార్పొరేషన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన కార్యక్రమాలలో ముస్లింలపై వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను గురించి ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.

సాయాజిక బస్సు యాత్ర పేరుతో జగన్‌ని మరోసారి సీఎం చేయడమే లక్ష్యంగా తిరుగుతున్న ఎస్సీ మంత్రులు, ఎమ్మెల్యేలకు దళితులపై జరుగుతున్న దాడులు కనిపించడం లేదా అని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు MS రాజు ప్రశ్నించారు. ఏలూరులోని ఓ కల్యాణ మండపంలో నిర్వహించిన దళిత శంఖారావం సభకు ముఖ్య అతిథిగా MS రాజు, మాజీ మంత్రులు జవహర్, పీతల సుజాతతో పాల్గొన్నారు. ప్రభుత్వ దళిత వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా జనవరి 10న దండయాత్ర మహాసభ నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. దళితులపై జరగుతున్న దారుణాలను ప్రశ్నించడానికే... ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దళిత శంఖారావ సభలు నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి పీతల సుజాత తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story