LOKESH: అభివృద్ధిపై చర్చకు సిద్ధమా జగన్

వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని జగన్ కు...టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ సవాలు విసిరారు. చినకాకానిలో అపార్ట్మెంట్ వాసులతో ఆయన సమావేశం అయ్యారు. అధికారంలోకి వచ్చాక... కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని ప్రకటించారు. బోధనా రుసుముల చెల్లింపుల్లో పాత విధానం అమలు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. తర్వాత యార్లగడ్డ వెంకట్రావు కాలనీలో ప్రజలతో లోకేష్ సమావేశమయ్యారు. దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చి దిద్దుతానని ప్రజలకు హామీ ఇచ్చారు. దుగ్గిరాల శుభం మహేశ్వరి గోల్డ్ స్టోరేజ్ లో అగ్ని ప్రమాదానికి గురైన బాధితులు, న్యాయం చేయాలని లోకేష్ కు తమ గోడు వెల్లబుచ్చుకున్నారు. అధికారంలోకి రాగానే అన్ని సమస్యలను పరిష్కరిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు.
చంద్రబాబు డిమాండ్
రాష్ట్రంలో తాగునీటి సమస్యపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. రైతులకు సాగునీరు... ప్రజలకు తాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతాల నుంచి గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ వరకు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉందన్నారు. విద్యుత్ బిల్లులు చెల్లించక తాగునీటి పథకాలు మూలనపడ్డాయన్నారు. ట్యాంకర్లతో మంచినీటి సరఫరా ఎప్పుడో అటకెక్కిందని విమర్శించారు. ఈ వేసవి ఎలా గడుస్తుందో ప్రజలకు అర్థం కావడం లేదన్నారు. ప్రజల కష్టాలు తీర్చడానికి పాలకుడి దగ్గర ప్రణాళికే లేదని ఎద్దెవా చేశారు. జగన్ సర్కారు అక్రమాలపై కాకుండా తాగునీటి కష్టాలపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు
ఈసీకి ఫిర్యాదు
మరోవైపు ఏపీలో పోలీసుల వ్యవహార శైలిలో ఎలాంటి మార్పూ రాలేదని తెలుగుదేశం నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. మచిలీపట్నంలో అధికార పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టూ పోలీసు స్టేషన్ పై దాడి చేశారని మండిపడ్డారు. స్టేషన్ పై దాడి చేస్తే దానిని ఆకతాయితనంతో చేసినట్టు పోలీసులు కేసు పెట్టడం దుర్మార్గమన్నారు. ఇలాటి తరుణంలో పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయా అని నిలదీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com