రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న కడప టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి హత్య

రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న కడప టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి హత్య
సీఎం సొంత జిల్లాలో నందం సుబ్బయ్యను హతమార్చడం.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు అద్దం పడుతోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

కడప జిల్లా ప్రొద్దూటూరులో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్యను హత్య రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ హత్య వెనుక అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఆయన బావమరిది ప్రమేయం ఉందని సుబ్బయ్య కుటుంబ సభ్యులు, సన్నిహితులు, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సోములవారిపల్లె పొలాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్ జగనన్న కాలనీలో.. నందం సుబ్బయ్య హత్య జరిగింది. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్లాట్‌లలోనే దారుణంగా నరికి చంపారు. సుబ్బయ్య కళ్లలో కారం కొట్టి వేటకొడవళ్లతో దారుణంగా హత్యచేశారు. సుబ్బయ్యను రెండు వాహనాల్లో వెంబడించి హత్య చేసినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గతంలో వైసీపీలో పనిచేసిన నందం సుబ్బయ్య కొన్నాళ్ల క్రితం టీడీపీలో చేరారు.. ప్రస్తుతం టీడీపీ జిల్లా అధికార ప్రతినిధిగా వున్న ఆయన రెండ్రోజుల క్రితం సోషల్‌ మీడియా వేదికగా ఇటీవల వైసీపీ నేతలను టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేశారు. పేదలకు ఇచ్చిన సెంటు భూమి కొనుగోళ్లలో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి, ఆయన బావమరిది అక్రమాలకు పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇద్దరు నేతల అవినీతిపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని త్వరలోనే బయటపెడతానని చెప్పారు. విమర్శలు చేసిన రెండు రోజులకే నందం సుబ్బయ్య దారుణ హత్యకు గురికావడంతో సంచలనం రేపుతోంది.

నందం సుబ్బయ్య హత్యను టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. చేనేత కుటుంబానికి చెందిన టీడీపీ నేత సుబ్బయ్యను హత్యను కిరాతక చర్యగా అభివర్ణించారు. కడప జిల్లా నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని దుర్మార్గ, కిరాతక, ఉన్మాద పాలన చూస్తున్నామన్నారు.. ప్రెస్‌మీట్లు పెట్టారని, సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని బీసీ నాయకుడు సుబ్బయ్య ప్రాణాలు తీస్తారా అంటూ అధికార పార్టీపై నిప్పులు చెరిగారు.. వైసీపీ అవినీతి కుంభకోణాలను బయటపెట్టడం సుబ్బయ్య చేసిన నేరమా అని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడిన వాళ్లను, మట్కా దందాలు చేసే వాళ్లను వదిలేసి వాటిని బయటపెట్టిన వాళ్లను చంపేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్తులపై కఠిన చర్యలు లేకపోవడం వల్లే నేరాలు ఘోరాలు పెచ్చుమీరుతున్నాయన్నారు చంద్రబాబు. కమిషనర్‌ కబరు చేసి పిలిపించారని, ఆయన కళ్లెదుటే చంపారనే విషయంపై మున్సిపల్‌ కమిషనర్‌ సమాధానం చెప్పాలన్నారు. సుబ్బయ్య హత్య వెనుక కుట్ర కోణాన్ని బహిర్గతం చేయాలన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునే వరకు టీడీపీ రాజీలేని పోరాటం చేస్తుందని చంద్రబాబు గుర్తు చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలంతా కలసికట్టుగా పోరాడాలన్నారు.. వైసీపీ హత్యా రాజకీయాలను ప్రజల్లో ఎండగట్టాలన్నారు.. జగన్‌ దుర్మార్గ పాలనపై ధైర్యంగా పోరాడాలని పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

సీఎం సొంత జిల్లాలో టీడీపీ నేత నందం సుబ్బయ్యను హతమార్చడం.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు అద్దం పడుతోందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనంటూ లేఖ విడుదల చేశారు. 19 నెలల జగన్ రెడ్డి పాలనలో హింస జరగని రోజంటూ ఉందా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కత్తులు, కర్రలు, మారణాయుధాలతో పాలన చేస్తూ.. ప్రజానీకానికి ఫ్యాక్షన్ రాజకీయం చూపిస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో అక్రమాలను నిలదీసి బాధితులకు అండగా నిలబడినందుకే హత్యా రాజకీయాలకు తెరతీశారన్నారు. నిందితులను 24 గంటల్లోపు అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అచ్నెన్నాయుడు డిమాండ్ చేశారు.

ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక హత్యలు చేసే నైజం వైసీపీదంటూ టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నందం సుబ్బయ్య హత్యను ఆమె ఖండించారు. ఇళ్ల పట్టాల పేరుతో వేల కోట్ల కుంభకోణం చేసిన వైసీపీ నేతలు ఆ అవినీతి డబ్బును పంచుకున్నారన్నారు. ధర్మవరం, మంగళగిరి నుంచి ఈ పరిస్థితి ప్రొద్దుటూరు వరకు పాకిందన్నారు అనురాధ.

Tags

Read MoreRead Less
Next Story