LOKESH: సత్యం గెలిచింది.. ధర్మం నిలిచింది

LOKESH: సత్యం గెలిచింది.. ధర్మం నిలిచింది
చంద్రబాబు రెగ్యులర్‌ బెయిల్‌పై నారా లోకేశ్‌ కామెంట్స్‌... జగన్‌ ఏం సమాధానం చెప్తారన్న టీడీపీ నేతలు

జ‌గ‌న్ క‌నుస‌న్నల్లో వ్యవ‌స్థల మేనేజ్‌మెంట్‌పై స‌త్యం గెలిచిందని చంద్రబాబు నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం మ‌రోసారి స‌మున్నతంగా త‌ల ఎత్తుకుని నిల‌బ‌డిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. తాను త‌ప్పుచేయ‌ను, చేయ‌నివ్వనని బాబు ఎప్పుడూ చెప్పేదే... మ‌రోసారి నిజ‌మైందన్నారు. బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో కుట్రకేసుల‌న్నింటినీ చంద్రబాబు జ‌యిస్తారని, కడిగిన ముత్యంలా బయటికొస్తారని తేలిపోయిందన్నారు. సత్యం గెలిచిందని, జ‌గ‌న్ అనే అస‌త్యంపై యుద్ధం ఆరంభం కానుందని లోకేశ్‌ అన్నారు. ఆధారాల్లేని ఆరోపణలకు ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తారని పయ్యావుల కేశవ్‌ నిలదీశారు. చంద్రబాబుకు బెయిల్‌పైతెలుగుదేశం శ్రేణుల్లో హర్షాతిరేకాల వ్యక్తమయ్యాయి. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసం వద్ద కార్యకర్తలు బాణసంచా కాల్చారు.మంగళగిరి ప్రధాన కార్యాలయం వద్ద చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు గ్రంథాలయ కూడలిలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.


రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టులా హైకోర్టు తీర్పు ఇచ్చిందని టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తెలిపారు. చంద్ర బాబు కి రెగ్యులర్‌ బెయిల్‌ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. అసత్యపు ఆరోపణలతో పెట్టిన స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో చంద్ర బాబు నిజాయతీ ఏంటో .ఇప్పుడై ముఖ్యమంత్రి తెలుసుకోవాలని పేర్కొన్నారు. రెగ్యులర్ బెయిల్ లోనూ కండీషన్లు కొనసాగించాలని సీఐడీ వాదించినా హైకోర్టు అంగీకరించకపోవడం శుభపరిణామమన్నారు. చంద్రబాబు బయట ఉంటే ఎదుర్కోవడం కష్టం అని గుర్తించిన వైసీపీ ఈ దుర్మార్గానికి ఒడికట్టిందని సోమిరెడ్డి విమర్శించారు.


చంద్రబాబు బెయిలు ఉత్తర్వులనూ వైసీపీ నాయకులు వక్రీకరిస్తున్నారని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్ అండ్ కో తొలుత వాళ్లపై ఉన్న CBI కేసులవిచారణను ఎదుర్కొని, ఆ తర్వాత ఎదుటివారిపై ఆరోపణలు చేయాలని చురకలు వేశారు. చంద్రబాబుకు బెయిల్ రావడంపై... నరసాపురం ఎంపీ రఘరామకృష్ణరాజు... హర్షం వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టులోనూ చంద్రబాబుకు ఉరట లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు..

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం NTR భవన్ ముందు మిఠాయిలు పంచుకుని నృత్యాలు చేశారు. పార్వతీపురం తెలుగుదేశం కార్యాలయం వద్ద టపాసులు పేల్చారు.శ్రీకాకుళంలో సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో బాణసంచా కాల్చగా... ఆమదాలవలసలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబకు బెయిల్ మంజూరుపై అమరావతి రైతులు సంతోషం వ్యక్తం చేశారు. అమరావతి ఉద్యమానికి భరోసా వచ్చిందని అమరావతి పరిరక్షణ సమితి సమన్వయకర్త సుధాకర్ అన్నారు..

Tags

Read MoreRead Less
Next Story