Kolikapudi: టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరైన ఎమ్మెల్యే కొలికపూడి

టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు. టీడీపీ సీనియర్ నేత ఎంఏ షరీఫ్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణలు కొలికపూడి నుంచి వివరణ తీసుకున్నారు. ఇటీవల జరిగిన వరస సంఘటనలపై ఎమ్మెల్యేను క్రమశిక్షణ కమిటీ వివరణ అడిగింది. తాను ఎలాంటి తప్పు చెయ్యలేదని, గిరిజన మహిళ విషయంలో కేసు కూడా నమోదు కాలేదని కొలికపూడి కమిటీ సభ్యులకు చెప్పారు. కొలికపూడి సమాధానాల వివరణలతో సీఎం చంద్రబాబుకు క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇవ్వనుంది.
టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ… ‘ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ నుంచి వివరణ తీసుకున్నాం. రోడ్డుకు అడ్డంగా కంచె వెయ్యడానికి సంబంధించిన అంశం ఎమ్మెల్యేను ఆడిగాము. గిరిజన మహిళపై దాడి విషయంలో కూడా ప్రశ్నించాము. రోడ్డుకు అడ్డంగా కంచె ఏంటని గిరిజన మహిళను అడిగి నట్టుగా ఎమ్మెల్యే చెప్పారు. తను ఎలాంటి దాడి చేయలేదన్నారు. కమిటీ కొలికపూడి శ్రీనివాస్ వివరణలతో నివేదిక తయారు చేసి సీఎం చంద్రబాబుకు అందిస్తుంది’ అని తెలిపారు.
ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి కొలికపూడి శ్రీనివాస్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. కొలికపూడి వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జనవరి 11న ఎ.కొండూరు మండలం గోపాలపురంలో ఎమ్మెల్యే వ్యవహార శైలితో మనస్తాపం చెంది ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనపై సీఎం సీరియస్ అయ్యారు. తీరు మార్చుకోవాలని గతంలోనే కొలికపూడికి సీఎం సూచించినా.. ఆయనలో మార్పు రాలేదు. దాంతో క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలిచి వివరణ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ ఎదుట నేడు కొలికపూడి హాజరయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com