TDP: విలువలకు కట్టుబడి... పోటీకి దూరంగా..
విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నిక నుంచి టీడీపీ ఎందుకు తప్పుకుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే సంఖ్యాబలం లేనప్పుడు పోటీ పెట్టడం సరికాదని చంద్రబాబు భావించారట. విలువలతో కూడిన రాజకీయానికి కట్టుబడి పోటీ చేయాలన్న నిర్ణయాన్ని మార్చుకున్నామని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. టీడీపీ నిర్ణయంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోరాహోరీ తప్పదనుకున్న వైసీపీ ఊపిరి పీల్చుకుంది.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఉద్దండుడుగా గుర్తింపు ఉన్న బొత్స సత్యనారాయణ ఇప్పుడు తొలిసారి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన బొత్స ఇప్పుడు ఎమ్మెల్సీగా మండలిలో అడుగుపెట్టడం లాంఛనమే. ఇది స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక కావడంతో వాస్తవంగా అయితే వైసీపీకి టెన్షన్ అక్కర్లేదు. అందులో ఓటర్లయిన స్థానిక సంస్థల ప్రతినిధుల బలం కావాల్సినంత ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ పోటీ పెడుతుందన్న కంగారు మొదట్లో వైసీపీ శిబిరంలో కనిపించింది.
టీడీపీ కీలక నిర్ణయం
ఓటింగ్ బలం లేనప్పుడు పోటీ పెట్టడం రాజకీయ విలువలకు విరుద్ధమన్న చర్చ టీడీపీ శిబిరంలో విస్తృతంగా జరిగింది. ఆ దిశగా అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుని తాము పోటీ చేయబోవడం లేదని చెప్పేసింది . దీంతో నామినేషన్ల దాఖలు గడువు ముగిసే సరికి రెండే దాఖలయ్యాయి. అందులో ఒకటి బొత్సది కాగా… మరొకరు స్వతంత్ర అభ్యర్థి. వాస్తవానికి ఈ ఎన్నికల్లో పోటీ పోరా హోరీగా జరుగుతుందని అంతా ఊహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా నాయకత్వానికి టచ్ లోకి రావడం, ఓటర్లను కాపాడుకునే ప్రయత్నం చేయడం వంటి కీలక పరిణామాలు జరిగాయి. కీడెంచి మేలు ఎంచాలనుకున్న వైసీపీ.. తమ ఎంపీటీసీలు, జడ్పిటిసి లను క్యాంపులకు తరలించింది. దీంతో ఎమ్మెల్సీ పోరు హోరాహోరీగా మారుతుందని, ఫలితం ఎవరికి అనుకూలంగా మారుతుందన్న లెక్కలు వాతావరణాన్ని వేడెక్కించాయి.
ఇటీవల గ్రేటర్ విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీకి పూర్తి స్ధాయి మెజారిటీ వున్నా 10కి 10 టీడీపీ కూటమి చేజిక్కుంచుకోవడంతో ఎమ్మెల్సీ పోటీ అదే స్ధాయిలో వుంటుందని ఊహించారు. ఇలాంటి వాతావరణంలో విలువలతో కూడిన రాజకీయానికి కట్టుబడి టీడీపీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. సంఖ్యాబలం లేదన్న కారణంతో ఎమ్మెల్సీ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com