PROTETS: దీక్షలు, ర్యాలీలతో హోరెత్తుతున్న ఏపీ

PROTETS: దీక్షలు, ర్యాలీలతో హోరెత్తుతున్న ఏపీ
చంద్రబాబు అరెస్ట్‌ అక్రమమంటూ నినదిస్తున్న ప్రజలు.... టీడీపీ దీక్షలకు వెల్లువెత్తుతున్న మద్దతు

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్ట్‌కు నిరసనగా ఆంధ్రప్రదేశ్‌లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ అధినేతను అక్రమంగా అరెస్టు చేశారంటూ అభిమానులు నిరసనలు, దీక్షలతో హోరెత్తిస్తున్నారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో తెలుగుదేశం కార్యకర్తలు రోడ్డుపై మోకాళ్లపై నడుస్తూ నిరసన తెలిపారు. బాపట్ల జిల్లా రేపల్లెలో మత్స్యకారులు బోటు, వలలతో నిరసన తెలిపారు. బాపట్లలోని తెలుగుదేశం కార్యాలయం వద్ద.. శ్రేణులు చేపట్టిన దీక్షకు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ సంఘీభావం తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో చంద్రబాబు ఫేస్ మాస్కులు ధరించి... నిరసన తెలిపారు. ‍


చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ... ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యాన అనంతపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు సాగిన ర్యాలీలో... తెలుగుదేశం, జనసేన, CPI నాయకులు, కార్యకర్తలు, పెద్దఎత్తున అభిమానులు పాల్గొన్నారు. మేముసైతం అంటూ న్యాయవాదులు, ఐటీ నిపుణులు, గృహిణులు కదం తొక్కారు. చంద్రబాబు అరెస్టును ఖండించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

చంద్రబాబు అక్రమ అరెస్టుపై గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురులో మ‌హిళ‌లు చేతులకు సంకెళ్లతో నిర‌స‌న‌ తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు... అక్రమ కేసులో చంద్రబాబును అరెస్టు చేయడం దారుణమన్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం దీక్షలో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. N.T.R జిల్లా మైలవరంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. విజయవాడలో MLA గద్దె రామ్మోహన్ ఆధ్వర్యాన మైనార్టీలు నిరసన దీక్ష చేశారు.


చంద్రబాబు అక్రమ అరెస్టు, రాష్ట్ర పరిస్థితులపై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలంటూ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి రాష్ట్రపతి భవన్‌కు పోస్టుకార్డులు పంపించారు. నంద్యాల రిలే నిరాహారదీక్షలో రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో తెలుగుదేశం నాయకులు దీక్ష చేశారు. తూర్పుగోదావరి జిల్లా పందలపాకలో నిర్వహించిన కాగడల ర్యాలీలో... సైకో పోవాలి- సైకిల్‌ రావాలంటూ తెలుగుదేశం నాయకులు నినాదాలు చేశారు. అనపర్తి మండలం లక్ష్మీనరసాపురంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ఇంటింటికి వెళ్లి "బాబుతో నేను" అంటూ కరపత్రాలు పంపిణీ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story