టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు సంచలన వ్యాఖ్యలు

టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు సంచలన వ్యాఖ్యలు
సమావేశం అనంతరం టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు... సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో ఆలయాల్లో వరుస దాడులపై టీడీపీ పొలిట్‌ బ్యూరో సీరియస్‌గా చర్చించింది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో... నేతలు భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా గుళ్లు, విగ్రహాల ధ్వంసం ఘటనలు 125 జరిగినట్టు జాబితా సిద్ధం చేశారు. ఆలయాలపై దాడుల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. టీడీపీ ప్రతినిధి బృందం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ కావాలని సమావేశంలో సూచనలు వచ్చాయి. అలాగే.. త్వరలోనే చంద్రబాబు నేతృత్వంలో ఏపీ గవర్నర్‌ను కలవాలని నిర్ణయించారు. హిందూ మతం మనోభావాల్ని జగన్‌ పట్టించుకోవడం లేదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

అటు.. సమావేశం అనంతరం మాట్లాడిన టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు... సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం, హోంమంత్రి, డీజీపీ క్రైస్తవులేనని అన్నారు. ముగ్గురూ క్రైస్తవులైనప్పుడు... హిందూ మతం విషయంలో ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. ప్రభుత్వం విశృంఖలత్వంతోనే.. రాముడి విగ్రహం శిరచ్ఛేదన వరకు వచ్చిందని ధ్వజమెత్తారు. ఏపీలో ఆందోళనకర వాతావరణం నెలకొందని, మెజారిటి ప్రజల మనోభావాల్ని జగన్‌ సర్కారు దెబ్బతీస్తోందని మండిపడ్డారు. బ్రిటిష్‌ కాలంలోనూ దేవాలయాలపై ఈ స్థాయిలో దాడులు జరగలేదని కాల్వ శ్రీనివాసులు విమర్శించారు.


Tags

Read MoreRead Less
Next Story