AP Assembly : జంగారెడ్డిగూడెం ఘటనపై రెండో రోజు దద్దరిల్లుతున్న అసెంబ్లీ

AP Assembly : జంగారెడ్డిగూడెం ఘటనపై రెండో రోజు దద్దరిల్లుతున్న అసెంబ్లీ
AP Assembly : జంగారెడ్డిగూడెం ఘటనపై రెండో రోజు కూడా అసెంబ్లీ దద్దరిల్లుతోంది. స్పీకర్ పోడియం వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.

AP Assembly : జంగారెడ్డిగూడెం ఘటనపై రెండో రోజు కూడా అసెంబ్లీ దద్దరిల్లుతోంది. స్పీకర్ పోడియం వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఉభయ సభల్లో టీడీపీ సభ్యులు నిరసన తెలియజేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రత్యేక చర్చ చేపట్టాలని టీడీపీ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం ఇచ్చారు. మద్యపాన నిషేధం ఏమైందంటూ ప్లకార్డుల ప్రదర్శన చేపట్టారు టీడీపీ సభ్యులు. టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళనల మధ్య అసెంబ్లీ కొనసాగుతోంది.

జంగారెడ్డిగూడెం ఘటన సహజ మరణాలంటూ జగన్‌ ప్రకటన చేయడంపై టీడీపీ తీవ్ర నిరసన తెలిపింది. జగన్ ప్రకటనను నిరసిస్తూ.. నారా లోకేష్ ఆధ్వర్యంలో అసెంబ్లీకి నిరసన ప్రదర్శనగా వెళ్లారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కల్తీ సారా మరణాలు ప్రభుత్వ హత్యలే అంటూ నినాదాలు చేశారు.

కల్తీ సారా మరణాలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని నిలదీశారు టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. అసెంబ్లీలో ప్రశ్నించడానికి ఈ ప్రభుత్వం ఒక్క నిమిషం సమయం కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. జంగారెడ్డిగూడెం ఘటనపై విచారణ అనగానే.. ప్రభుత్వం పారిపోతోందని ఎద్దేవా చేశారు.

జంగారెడ్డిగూడెంలో 26 మంది మరణాలకు జగనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు టీడీపీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు. బాబాయి హత్యను గుండెపోటుగా చెప్పిన వాళ్లు.. కల్తీ సారా మరణాలను సహజ మరణాలుగా చెప్పడంలో పెద్ద వింతేమీ లేదని కామెంట్ చేశారు. ప్రభుత్వం తరపున తప్పు ఉంది కాబట్టే.. సభలో చర్చకు వెనకాడుతోందని విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story