AP: రేపే చంద్రబాబు ప్రమాణ స్వీకారం

AP: రేపే చంద్రబాబు ప్రమాణ స్వీకారం
చివరి దశకు చేరుకున్న ఏర్పాట్లు... వైసీపీ బాధిత కుటుంబాలకు ప్రత్యేక ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చివరి దశకు చేరుతున్నాయి. రేపు జరిగే వేడుకకు కేసరపల్లి ఐటీ పార్క్‌ ముస్తాబవుతోంది. ప్రమాణ స్వీకారానికి 112 వైసీపీ బాధిత కుటుంబ సభ్యుల్ని ఆహ్వానించారు. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లతో కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి కళకళలాడుతోంది. రేపు ఉదయం.. 11 గంటల 27 నిమిషాలకు ఐటీ పార్క్‌ వద్ద జరిగే ప్రమాణ స్వీకారానికి కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రానుండడంతో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.


భారీ షెడ్లు నిర్మించి వచ్చిన వారికి అసౌకర్యం కలగకుండా చూస్తున్నారు. V.I.P.ల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నలుగురు I.A.S. అధికారులతో కూడిన కమిటి చంద్రబాబు ప్రమాణస్వీకార ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తోంది కార్యకర్తల కోసం నియోజకవర్గానికి 150 పాసులు ఇచ్చే అవకాశం ఉంది. 175 నియోజకవర్గాల దాదాపు 70 వేల నుంచి లక్ష మంది వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగుదేశం నేతలు దగ్గరుండి పనులు చేయిస్తున్నారు.

ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. V.I.P.ల తాకిడి దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు. ముగ్గురు A.D.G. స్థాయి అధికారులు బందోబస్తులో పాల్గొంటున్నారని కృష్ణా జిల్లా ఎస్పీ నయింఅస్మీ తెలిపారు. ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనలో నయవంచనకు గురైన జగన్‌ బాధితులను చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ఆహ్వానించింది. వారి కోసం సభా ప్రాంగణంలో ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. మొత్తం 112 వైసీపీ బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. నంద్యాలలో వైసీపీ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులతోపాటు, వైసీపీ ఎమ్మెల్సీ చేతిలో హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్నీ ఆహ్వానిస్తున్నారు.. ఒక్క పల్నాడు జిల్లాలోనే 86మంది బాధిత కుటుంబాలను ఆహ్వానిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story