TDP PROTEST: జగన్‌ది కక్ష సాధింపే

TDP PROTEST: జగన్‌ది కక్ష సాధింపే
చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై కొనసాగుతున్న ఆందోళనలు... భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ నేతల ఆందోళనలకు కొనసాగుతున్నాయి. రాజకీయ కక్ష సాధింపు ధోరణితో సీఎం జగన్‌ పాలన సాగిస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. అవినీతి మచ్చలేని చంద్రబాబును స్కిల్‌ కేసులో అక్రమంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతపురంలో టీడీపీ, సీపీఐ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. కళ్యాణదుర్గంలో ఎస్సీ సెల్‌ నాయకుడు ఉమామహేశ్వర నాయుడు అర గుండు గీయించుకుని చంద్రబాబు అరెస్టుపై నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ జిల్లా మైదుకూరులో రిలే నిరహారదీక్షల్లో తెదేపా నేత పుట్టా సుధాకర్ యాదవ్‌ పాల్గొన్నారు. నంద్యాలలో చేపట్టిన దీక్షల్లో ఎస్సీ సెల్‌ నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడిలో తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఆలయంలో 101 టెంకాయలు కొట్టారు. అనంతరం ఇంటింటి ప్రచారం చేపట్టి బాబుతో నేను కరపత్రాలను పంపిణీ చేశారు. వరికుంటపాడు మండలం కాకోళ్లువారిపల్లెలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు కాగడాల ప్రదర్శన నిర్వహించారు.


సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లిలో మహిళలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. కదిరిలో రిలే నిరహార దీక్షల్లో మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. మడకశిర నుంచి చందకచర్ల వరకు 15 కిలోమీటర్ల మేర తెదేపా నేత తిప్పేస్వామి పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. అనుమతి లేదంటూ పోలీసులు పాదయాత్రను అడ్డుకోవడంతో.....తెదేపా కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం గోగులపాడులో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ప్రత్యేక యాగం నిర్వహించారు. తొలుత గ్రామంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. కృష్ణాజిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళంలో తెదేపా నేత మండలి బుద్ధ ప్రసాద్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడలో అర్ధనగ్నంగా భిక్షాటన చేస్తూ టీఎన్టీయూసీ కార్మికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.


పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. తణుకులో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, పార్టీ నాయకులతో కలిసి బాబుతో నేను కరపత్రాలను పంపిణీ చేశారు. అక్రమ కేసుల నుంచి చంద్రబాబు బయటకు రావాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండలో తెదేపా నేత నాగం వెంకటపతి మోకాళ్లపై వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని మొక్కు చెల్లించారు.

Tags

Read MoreRead Less
Next Story