TDP PROTEST: కదం తొక్కుతున్న టీడీపీ శ్రేణులు

TDP PROTEST: కదం తొక్కుతున్న టీడీపీ శ్రేణులు
చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆందోళనలు... భగ్గుమంటున్న ప్రజలు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణుల నిరసనలు పట్టువిడవకుండా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సైకో పాలనతో ప్రజలు విసుగు చెందారని ప్రజా ఉద్యమం తప్పదని తెలుగుదేశం నేతలు స్పష్టం చేశారు. మహిళలు పెద్దసంఖ్యలో కొవ్వొత్తుల ర్యాలీల్లో పాల్గొని కదం తొక్కారు. చంద్రబాబును విడుదల చేసేవరకూ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ విజయవాడలో మాజీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో ముస్లిం యువకులు ఆందోళన చేపట్టారు. టీడీపీ నేత కేశినేని చిన్ని ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మచిలీపట్నంలో రిలే నిరహార దీక్షల్లో మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్‌ పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో టీడీపీ నేత తలకిందులుగా కాళ్లు పైకి పెట్టి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కృష్ణాజిల్లా కూచిపూడిలోని దీక్షా శిబిరాన్ని మాజీమంత్రి కొల్లు రవీంద్ర సందర్శించి సంఘీభావం తెలిపారు. చంద్రబాబుకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని మళ్లీ ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుతూ పమిడిముక్కల నుంచి వీరంకి వరకు మహిళలు అఖండ దీపాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లిలో టీడీపీ, జనసేన శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ వీధుల్లో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు.


నరసరావుపేటలో దీక్షా శిబిరాన్ని సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు సందర్శించి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు త్వరగా జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ పల్నాడు జిల్లా క్రోసూరులో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా పామూరులో మహిళలు పెద్ద సంఖ్యలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ తనకల్లు జంబులింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలు కొట్టారు. నంద్యాలలో గాంధీ విగ్రహానికి తెదేపా శ్రేణులు వినతిపత్రం సమర్పించారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కొట్టాలు గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

కాకినాడలో మాజీ ఎమ్మెల్యే కొండబాబు, వాకలపూడిలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు కార్యకర్తలతో కలిసి దీక్షల్లో పాల్గొన్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో దీక్షా శిబిరాన్ని కార్మికులు, మత్స్యకారులు సందర్శించి సంఘీభావం తెలిపారు. విశాఖలో మహిళలు నలుపు రంగు వస్ర్తాలు ధరించి బీచ్‌ రోడ్డులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. భీమిలిలో తెదేపా శ్రేణులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనల్లో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం పిట్టాడలో తెదేపా కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఆందోళన చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలో తెదేపా నేతలు అర్ధనగ్నంగా నిరసన తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story