TDP: జగన్‌కి షాక్..టీడీపీలోకి ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు

వైసీపీ అధినేత జగన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ లో చేరారు.. ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఈ ముగ్గురు నేతలు టీడీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీలోని పదవులు, ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ముగ్గురు నేతలు ఇప్పటికే రాజీనామాలు సమర్పించారు. కానీ మండలి చైర్మన్ ఇంకా వీరి రాజీనామాలను ఆమోదించలేదు. వీరంతా ఇప్పటికే వైసీపీకి, ఎమ్మెల్సీ పదవులకు గుడ్ బై చెప్పేశారు. అయితే టీడీపీలో చేరిక మాత్రం ఆలస్యమైంది. వీరు పార్టీలో చేరేందుకు టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో చంద్రబాబు సమక్షంలో ముగ్గురు ఎమ్మెల్సీలు పసుపు కండువా కప్పుకున్నారు. గతంలో వైసీపీ తరఫున ఎమ్మెల్సీలు అయిన మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ వివిధ కారణాలతో ఆ పార్టీని వీడారు. జగన్ వైఖరి నచ్చలేదని ఒకరు, పార్టీలో ఇమడలేకపోతున్నట్లు మరో ఇద్దరు ప్రకటించారు. అయితే వీరు ముందుగానే టీడీపీ పెద్దలతో మాట్లాడుకుని ఆ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ పదవులు కూడా వదులుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు సునీల్, విజయశ్రీ, పులివర్తి నానితో పాటు ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖర్, అనురాధ పాల్గొన్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్సీలలో బల్లి కల్యాణ్ చక్రవర్తి పదవీకాలం 2027 వరకు ఉండగా... మర్రి రాజశేఖర్, పద్మశ్రీ పదవీకాలం 2029 వరకు ఉంది.
మర్రి రాజశేఖర్ కీలక వ్యాఖ్యలు
సీఎం నారా చంద్రబాబు నాయుడు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ అన్నారు. ఆరు నెలల కిందట తమ పదవులకు రాజీనామాలు చేస్తే.. శాసనమండలి ఛైర్మన్ ఇంకా రాజీనామాలు ఆమోదించడం లేదని చెప్పారు. మండలి ఛైర్మన్ వెనుక ఉండి నడిపించే వారి వల్లనే తమ రాజీనామాలను ఆమోదించకుండా కాలయాపన చేస్తున్నారంటూ మర్రి రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీనామాల ఆమోదం కోసం ఆరు నెలల పాటు ఎదురు చూశామని.. ఆమోదిస్తారనే నమ్మకం లేకనే పార్టీలోకి చేరినట్లు తెలిపారు. సోమవారం నుంచి మండలికి వెళ్తామని.. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బల్లి ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి కుటుంబం కీలకంగా వ్యవహరించేది. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం భీమవరంకు చెందిన బల్లి దుర్గాప్రసాద్ టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. దివంగత ఎన్టీఆర్ ప్రోత్సాహంతో 26 ఏళ్ల వయసులోనే దుర్గాప్రసాద్ రాజకీయాల్లో చేరారు. గూడూరు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు దుర్గా ప్రసాద్ ఎన్నికయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com