NARA LOKESH: ఎన్నికల్లో టీడీపీ-జనసేన అదరగొడుతుంది

NARA LOKESH: ఎన్నికల్లో టీడీపీ-జనసేన అదరగొడుతుంది
వచ్చే ఎన్నికల్లో కూటమి క్లీన్‌ స్వీప్‌ చేస్తుందన్న లోకేశ్‌... సీబీఐ కేసులున్న జగన్‌ అవినీతి ఆరోపణలు చేస్తున్నాడంటూ ఎద్దేవా

అవినీతిపరుడైన జగన్‌ నిజాయితీపరుడైన చంద్రబాబుపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మండిపడ్డారు. అవినీతిపరుడిగా అందరికీ తెలిసిన ముఖ్యమంత్రి, తమ పార్టీ ప్రచారాన్ని దెబ్బతీయడానికే తెలుగుదేశం అధినేత చంద్రబాబును అవినీతి ఆరోపణలతో అరెస్టు చేయించారని లోకేష్ ఆరోపించారు. దిల్లీ పర్యటనలో ఉన్న లోకేశ్‌ పలు జాతీయ వార్త సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు. 42 వేల కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం కేసులో సీఎం జగన్‌పై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసిందని..కానీ ఈ కేసు నత్తనడకన సాగుతోందని చెప్పారు. పదేళ్లుగా ఆయన బెయిలుపై బయట తిరుగుతున్నారని చెప్పారు. చంద్రబాబు పర్యటనలకు, తన పాదయాత్రకు వస్తున్న స్పందనతో జగన్ భయపడుతున్నారని లోకేష్‌ చెప్పారు.


అధికార వైకాపా, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా పోరాడేవారెవరైనా వాళ్లతో చేతులు కలిపేందుకు తాము సిద్ధమని లోకేష్‌ స్పష్టం చేశారు. బీజేపీ కలిసొచ్చినా, లేకున్నా టీడీపీ- జనసేన కూటమి ఆదరగొడుతుందని వచ్చే ఎన్నికలను స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుందని, దాని ఫలితం ఎన్నికల్లో చూస్తారని లోకేష్‌ చెప్పారు.

మరోవైపు ఇటు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రబాబు అరెస్టుని నిరసిస్తూ.. గుంటూరు జిల్లా పొన్నూరులో రిలే నిరాహారదీక్ష చేపట్టారు. చంద్రబాబుకి మంచి జరగాలంటూ బాపట్ల జిల్లా చీరాల తెలుగు మహిళలు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వరకు పాదయాత్ర చేశారు. మంగళగరిలో కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. గుంటూరులో..మహిళలు, వృద్ధులు కలిసి భారీ ర్యాలీ చేశారు. శుభం కల్యాణ మండపం నుంచి ప్రభుత్వ వ్యతిరేక నినానాదాలతో హోరెత్తించారు. నల్లబెలూన్లు ప్రదర్శించారు. ఈ ర్యాలీని.. పోలీసులు అడ్డుకునే క్రమంలో తోపులాట జరిగింది.

ఉమ్మడి కృష్ణాజిల్లా జగ్గయ్యపేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలోకి మోకాళ్లపై వెళ్లి పూజలు చేశారు. చంద్రబాబు అరెస్టుని నిరసిస్తూ నందిగామ రైతుపేటలోని తెలుగుదేశం చేపట్టిన దీక్షకు జనసేన నేతలు సంఘీభావం తెలిపారు.తోట్లవల్లూరుమండలం గరికిపర్రు గ్రామస్థులు నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని మౌన దీక్ష చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో.. పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో తెలుగుదేశం చేపట్టిన దీక్షకు న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మోకాళ్ల మీద ప్రదక్షిణలు చేశారు.

Tags

Next Story