CBN: ఫ్యాన్‌ రెక్కలు విరిచేయాలన్న చంద్రబాబు

CBN: ఫ్యాన్‌ రెక్కలు విరిచేయాలన్న చంద్రబాబు
నాలుగేళ్ల తర్వాత నాలుగో రాజధాని పల్లవి.... మండిపడ్డ తెలుగుదేశం అధినేత

నాలుగేళ్లు మూడు రాజధానుల పాట పాడిన సీఎం జగన్‌..ఇప్పుడు నాలుగో రాజధాని పల్లవి అందుకున్నారని. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం చేస్తానన్నా జగన్‌ పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. అలాంటి జగన్‌ను, ఆయన పార్టీ గుర్తు ఫ్యాన్‌ రెక్కలను విరిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మరో 52రోజుల్లో అధికారానికి వచ్చే.... తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం ఏపీ భవిష్యత్‌ను బంగారుమయం చేస్తుందన్నారు. కొన్నాళ్ల విరామం తర్వాత బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో రా...కదలిరా సభకు హాజరైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలుగుదేశం, జనసేన కూటమిని గెలిపించి రామరాజ్యాన్ని తీసుకురావాలని పిలుపునిచ్చారు.


పెద్ద సంఖ్యలో తరలివచ్చిన తెలుగుదేశం శ్రేణులు, జనసైనికుల సమక్షంలో మాట్లాడిన చంద్రబాబు వైసీపీ నేతలు పర్చూరులో ఫారం -7తో సుమారు 14 వేల దొంగ ఓట్ల చేర్పించారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హిరోలా పోరాడారని కితాబిచ్చారు. బాపట్ల ఎంపీ, పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని... వైసీపీ ఎమ్మెల్యే అరాచకాలపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు... విభజన హామీల కోసమే తాను నాడు భాజపాతో విభేదించినట్టు పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచుతానన్న జగన్‌ మాత్రం రాష్ట్రాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు.


వైసీపీ ఫ్యాను మూడు రెక్కలని మూడు ప్రాంతాల ప్రజలు విరగొట్టాలని..... చంద్రబాబు పిలుపునిచ్చారు. వచ్చే 52 రోజులు విరామం లేకుండా పనిచేసి........ రావణాసురుడి వధ చేయాలని యువతకు పిలుపునిచ్చారు. మద్యపాన నిషేధం, అధికారానికి వచ్చిన వారంలోపు సీపీఎస్ రద్దు చేస్తానన్న జగన్‌... ఆ మాట అప్పుడే మరిచారన్న చంద్రబాబు... తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం రాగానే రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని, ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు.

‘పోయే ప్రభుత్వాన్ని మోస్తే పోలీసులే మునిగిపోతారు. టీడీపీ సభను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. నోటీసులో ఏం ఉందో చూడకుండా సభ ఆపాలని ఎస్పీ అంటారా? మనం చట్ట ప్రకారం వెళ్తున్నాం.. అడ్డం వస్తే తొక్కుకుని పోతాం. జగన్‌ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలకు ముందే మన గెలుపు ఖాయమైంది. పర్చూరు నియోజకవర్గంలో గ్రానైట్‌ వ్యాపారులపై వైసీపీ నేతలు కేసులు పెట్టించి వేధించారు. మైనింగ్‌ అధికారులు వైసీపీ మూకలతో వెళ్లి వ్యాపారులను బెదిరించారు. అధికారం ఉందని ఆంబోతుల మాదిరిగా ఊరు మీద పడ్డారు. గొట్టిపాటి రవికుమార్‌కు రూ.3 వేల కోట్ల జరిమానా విధించారు. చివరకు నేను, పవన్‌ కల్యాణ్‌ కూడా వైసీపీ బాధితులమే. మాట్లాడితే జగన్‌ బటన్ నొక్కానని చెబుతున్నారు. అందుకే ఆర్టీసీ, విద్యుత్‌ ఛార్జీలు పెరిగాయి. చెత్త, నీరు, ఆస్తిపై పన్నులు పెంచారు. మద్యపాన నిషేధం, జాబ్‌ క్యాలెండర్‌పై జగన్‌ ఎందుకు బటన్‌ నొక్కలేదు. జగన్‌ పెట్టే ప్రతి స్కీమ్‌ వెనుక స్కామ్‌ ఉంటుంది. ఇలాంటి దోపిడీ ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story