ARREST: టీడీపీ నేత బీటెక్‌ రవి అరెస్ట్‌

ARREST: టీడీపీ నేత బీటెక్‌ రవి అరెస్ట్‌
పది నెలల తర్వాత కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసిన పోలీసులు.... 14 రోజుల రిమాండ్‌..

పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్‌ బీటెక్‌ రవిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నాటకీయ పరిణామాల మధ్య అర్ధరాత్రి కడప మెజిస్ట్రేట్‌ ఇంటి ముందు బీటెక్‌ రవి హజరుపరచగా 14 రోజులు రిమాండ్‌ విధించి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. మరోవైపు బీటెక్‌ రవిపై పోరుమామిళ్ల పోలీసులు బెట్టింగ్‌ కేసు నమోదు చేశారు. ప్రొద్దుటూరు టీడీపీ నేత ప్రవీణ్‌కుమార్‌ రెడ్డిని అరెస్టు చేసి కడప జైలుకు తరలించి 24 గంటలు గడవక ముందే బీటెక్‌ రవిని పోలీసులు అరెస్టు చేశారు. యువగళం ప్రారంభానికి రెండు రోజుల ముందు కడపకు లోకేష్‌ వచ్చిన సందర్భంగా జరిగిన ఓ సంఘటనలో బీటెక్‌ రవిని అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరి 25న నారా లోకేష్ కడప పెద్ద దర్గా దేవుని కడపలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ క్రమంలో కడప విమానాశ్రయానికి వచ్చిన లోకేష్‌ కోసం పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. విమానాశ్రయం గేటు వద్ద లోపలి వెళ్లడానికి బీటెక్ రవి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగింది. ఆ తోపులాటలో పోలీసులకు గాయాలయ్యయనే కారణంతో బీటెక్‌ రవిపైన 10 నెలల తర్వాత వల్లూరు మండలం పోలీసులు కేసు నమోదు చేశారు.


పులివెందుల నుంచి కడపకు వస్తున్న బీటెక్‌ రవిని యోగి వేమన విశ్వవిద్యాలయం వద్ద వల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వల్లూరు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లిన కాసేపటి తర్వాత కడప రిమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి అర్ధరాత్రి కడప మెజిస్ట్రేట్ భార్గవి ఇంటి వద్దకు తీసుకెళ్లి బీటెక్ రవిని హాజరు పరిచారు. FIR కాపీని రిమాండ్ రిపోర్టును అప్పటికప్పుడు బీటెక్ రవికి చూపించారని ఆయన తరపు న్యాయవాదులు జడ్జి ముందు వాదించారు. ఇవాళ ఉదయం కోర్టులో ప్రవేశపెట్టాలని రిమాండ్ రిపోర్టును వెనక్కి ఇస్తున్నట్లు మెజిస్ట్రేట్ ముందుగా ఆదేశించారు. కోర్టు ఆదేశాలను బీటెక్ రవి తరపు న్యాయవాది బయటకు వచ్చి మీడియాకు వెల్లడించారు. ఇది జరిగిన పావుగంట తర్వాత మళ్లీ జడ్జి నుంచి పిలుపు రావడంతో న్యాయవాదులు లోపలికి వెళ్లారు. పోలీసుల అభ్యర్థనను మరోసారి పరిశీలించిన న్యాయమూర్తి బీటెక్ రవికి ఈ నెల 27 తేదీ వరకు 14 రోజులు రిమాండ్ విధించారు. తర్వాత బీటెక్ రవిని కడప కేంద్ర కారాగారానికి తరలించారు.


బీటెక్‌ రవి అరెస్టును తెలుగుదేశం నేతలు తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్‌ తన ఎన్నికల ప్రత్యర్థి బీటెక్‌ రవిని చూసి భయపడుతున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఎద్దేవా చేశారు. జగన్‌ తన కక్ష సాధింపులకు పోలీసులను కార్యకర్తల్లా వాడుకుంటున్నారని మండిపడ్డారు. రవి అరెస్టు జగన్‌ సైకో తత్వానికి నిదర్శనమని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

Tags

Read MoreRead Less
Next Story