AP: చంద్రబాబు సభలో ఫోన్‌ ట్యాపింగ్ కలకలం

AP: చంద్రబాబు సభలో ఫోన్‌ ట్యాపింగ్ కలకలం
ఓ వ్యక్తిని పట్టుకున్న తెలుగుదేశం నేతలు .... విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని కదలికలపై నిఘా!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్వహించిన వర్క్ షాప్ లో ఫోన్ ట్యాపింగ్ కలకలం రేపింది. వర్క్ షాప్ లో తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నాడని ఓ వ్యక్తిని తెలుగుదేశం నేతలు పట్టుకున్నారు. కొందరు ఏపీ పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. అతన్ని విచారించగా.. తాను ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ అని, ఐజీ పంపితేనే వచ్చినట్లు చెప్పాడని తెలుగుదేశం నేత బోండా ఉమ తెలిపారు. విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని కదలికలపై అతను నిఘా పెట్టినట్టు వెల్లడించారు. ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్న ఆధారాలు కానిస్టేబుల్ ఫోన్లో తమకు లభ్యమయ్యాయని పేర్కొన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులపై వెంటనే ఈసీ చర్యలు తీసుకోవాలని బోండా ఉమ డిమాండ్ చేశారు.


తెలుగుదేశం MLA, MP అభ్యర్థులతో విజయవాడలో చంద్రబాబు వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం అభ్యర్థులతోపాటు జనసేన, భాజపా ప్రతినిధులు హాజరయ్యారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, అభ్యర్థులకు ఉండే హక్కులు, అధికార పార్టీ కుట్రలు..... లాంటి అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఎన్నికల్లో ప్రచారం, నామినేషన్ల దాఖలు వంటి అంశాలపైనా నేతలు చర్చించారు. అభ్యర్థులు అనుసరించాల్సిన పద్ధతులు, వ్యూహాలపై చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. కోడ్‌ ఉల్లంఘించారని ఫొటోలు తీస్తుంటే కడప ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిపై వైకాపా నాయకులు దాడికి యత్నించారని చంద్రబాబు ధ్వజమెత్తారు. అన్యాయంపై మాధవి ఎదురుతిరిగిన తీరుని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.


రాష్ట్ర ప్రగతి కోసం మూడు పార్టీలు వేసే పునాది... 30 ఏళ్ల భవిష్యత్తుకు నాంది పలకాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. N.D.A.కి కేంద్రంలో 400కి పైగా ఎంపీ సీట్లు, రాష్ట్రంలో 160కి పైగా అసెంబ్లీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. వైకాపా లాంటి పార్టీలకు కట్టడి వేయాలంటే డిజిటల్‌ కరెన్సీ రావాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పొత్తు వల్ల సీట్లు రాని తెలుగుదేశం నేతలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు

Tags

Read MoreRead Less
Next Story