TDP: ఓట్ల అక్రమాలపై సీఈసీకి టీడీపీ ఫిర్యాదు

TDP: ఓట్ల అక్రమాలపై సీఈసీకి టీడీపీ ఫిర్యాదు
అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఫిర్యాదు....దొంగ ఓట్లపై సీఈసీకి వివరించిన నేతలు

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో అక్రమాలపై తెలుగుదేశం బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు నేతృత్వంలో ఢిల్లీలో CECని కలిసిన తెలుగుదేశం నేతలు ఏపీలో ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల చేర్పులపై ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఈసీ ఆదేశాలను అధికారులు పాటించడం లేదని తెలిపారు. దేశంలో ఏ ఎన్నికలకైనా.. ఉపాధ్యాయులనే వినియోగిస్తున్నారని గుర్తు చేసిన అచ్చెన్నాయుడు.... ఏపీలో మాత్రం ఎన్నికలకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారని EC దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. గ్రామ సచివాలయ వ్యవస్థ కనుసన్నల్లో..ఎన్నికల ప్రక్రియ నడుస్తోందని. వాలంటీర్ల ద్వారా తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని విమర్శించారు. గ్రామ సచివాలయ సిబ్బందిని ఎన్నికలకు దూరంగా ఉంచాలని కోరినట్లు భేటీ తర్వాత అచ్చెన్నాయుడు వెల్లడించారు.


మరోవైపు ఓట్ల తొలగింపుపై పల్నాడు జిల్లా పెదకూరపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద అత్తలూరు, ఉంగుటూరు గ్రామాల ప్రజలు నిరసన తెలిపారు. గ్రామంలో లేరని... తమను ఓట్ల జాబితా నుంచి తొలగించి...నోటీసుల పంపారని ఆందోళనకు దిగారు. వైకాపా నేతలు ఇచ్చిన జాబితా ఆధారంగా BLOలు నోటీసులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉంగుటూరులో 83, అత్తలూరులో 130 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. ఉపాధి, చదువుల కోసం తాత్కాలికంగా వెళ్లిన వారికి కూడా నోటీసులు ఇస్తున్నారంటూ ఎన్నికల నమోదు అధికారి దేశిరెడ్డి నాగజ్యోతికి ఫిర్యాదు చేశారు.


ఇంకోవైపు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో దొంగ ఓట్లు కలకలం రేపుతున్నాయి. ఓట్ల అక్రమార్కులు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. తాజాగా విడుదల చేసిన జాబితా... తప్పులతడకగా ఉంది. ఒకే ఇంటి చిరునామాతో 10 మంది కంటే ఎక్కువగా ఉన్న ఓటర్ల సంఖ్య 12 వేలు దాటింది. దొంగ ఓట్లను తొలగించాలని ప్రతిపక్షాలు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సుమారు 2 లక్షల 65 వేల మంది ఓటర్లు ఉన్నారు. తాజాగా విడుదలైన ఓటర్ల జాబితా తప్పులతడకగా ఉండటంతోపాటు భారీగా దొంగ ఓట్లు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆధారాలతో సహా ఆరోపిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి సెప్టెంబర్‌ 12 వరకు ఓటరు నమోదు, తొలగింపు, మార్పులు చేర్పులు కోసం... మొత్తం 32 వేల 557 దరఖాస్తులు చేసినా... పెద్దగా మార్పులు చేపట్టలేదు. జోహరాపురంలోని 257వ బూత్‌ నంబర్‌లో... 34/205 A ఇంటి చిరునామాలో ఓ మహిళ పేరు గగగగ, భర్త పేరు పపపపగా నమోదైంది. అదే చిరునామాలో మరో ఓటరు పేరు దదదద, తండ్రి పేరు దదదదగా రికార్డయింది. జోహరాపురంలోనే 69/706-16 చిరునామాలో ఓ మహిళ పేరు పప, తండ్రి పేరు పగా నమోదు చేశారు. 69/706/C49 చిరునామాతో ఓ మహిళ పేరు అర్థంకాని భాషలో నమోదైంది. ఇలాంటి తప్పులు కోకొల్లలుగా ఉన్నాయని ప్రతిపక్షాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story