KRISHNA RIVER: కష్టకాలంలో కృష్ణా బేసిన్‌..కనిపించని నీటి జాడ..

KRISHNA RIVER: కష్టకాలంలో కృష్ణా బేసిన్‌..కనిపించని నీటి జాడ..
కృష్ణానదిలో నీటి ప్రవాహం కనిపించడంలేదు.దాదాపు దశాబ్దం తర్వాత మళ్లీ గడ్డు పరిస్థితి ఏర్పడింది.

కృష్ణా బేసిన్‌లకు కష్టకాలం వచ్చింది. కృష్ణానదిలో నీటి ప్రవాహం కనిపించడంలేదు. దాదాపు దశాబ్దం తర్వాత మళ్లీ గడ్డు పరిస్థితి ఏర్పడింది. పదేళ్ల తర్వాత ఆలమట్టిలో జీరో టీఎంసీల పరిస్థితి నెలకొంది.ఇప్పటివరకు వచ్చిన నీటి ప్రవాహాలను ప్రాతిప్రదికన తీసుకొంటే గతంలో ఏర్పడ్డ సంక్షోభ పరిస్థితులు మళ్లీ ఏర్పడనున్నాయా అన్న ఆందోళనను ఇరిగేషన్‌ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాల సీజన్‌ ప్రారంభమై దాదాపు 40 రోజులైంది. ఇప్పటివరకు ఎగువ కృష్ణానదిపై ఉన్న ఆలమట్టిలోకి చుక్కనీరు కూడా చేరలేదు. ఈ పరిస్థితి ఆలమట్టి నిర్మాణం తర్వాత ఎప్పుడూ ఎదురుకాలేదు. 2015లో జులై నెలలో మొదటి పదిహేను రోజుల వరకు కేవలం 0.23 టీఎంసీ మాత్రమే వచ్చింది. తర్వాత 15 రోజుల్లో 120 టీఎంసీలు రావడంతో కాస్త ఆలస్యమైనా ఆగస్టు మొదటివారంలో దిగువకు నీటిని విడుదల చేశారు. అయితే తరువాతి కాలంలో వర్షభావ పరిస్థితులు ఎదురైనా జులై చివర్లో లేదా ఆగస్టు మొదటి వారంలో దిగువకు నీటిని విడుదల చేసేవారు. కనీసం 25 నుంచి 30 టీఎంసీల నీరు అయినా వచ్చేవి. కానీ ఈ ఏడాది మాత్రం ఇప్పటివరకు చుక్క నీరు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది.

ఇక తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బేసిన్‌ అత్యంత కీలకమైనది. శ్రీశైలం,నాగార్జునసాగర్‌తో పాటు తెలంగాణలోని నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా తదితర ప్రాజెక్టులు శ్రీశైలం, జూరాల మీద ఆధారపడి నీటిని తీసుకొంటున్నాయి. బచావత్‌ ట్రైబ్యునల్‌ ఉమ్మడి ఏపీకు 811 టీఎంసీలు కేటాయిస్తే, ఇందులో 450 టీఎంసీలు ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి రావాలి. ప్రత్యేకంగా ఆలమట్టి నుంచి ఎక్కువగా, తుంగభద్ర నుంచి కొంత రావాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టుల్లోకి అసలు ప్రవాహం లేకపోవడం,నీటి జాడ కనిపించకపోవడంతో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఇరిగేషన్‌ అధికారులు ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు కృష్ణా బేసిన్‌లో 2002 నుంచి 2004 వరకు ఆ తర్వాత 2015 లోనూ తీవ్ర వర్షభావ పరిస్థితులు ఎదురయ్యాయి. అప్పట్లో జులై నెలలో ఏ రిజర్వాయర్‌లోకి నీటి ప్రవాహం రాలేదు. అయితే ఈ ఏడాది నాటి పరిస్థితుల కంటే దారుణంగా ఉంది. కృష్ణా నది కర్ణాటక తర్వాత తెలంగాణలోని జూరాల ప్రాజెక్టు ఉన్నా దీని సామర్థ్యం తక్కువ కావడంతో దానికి దిగువన ఉన్న ఉమ్మడి శ్రీశైలం ప్రాజెక్టు రెండు రాష్ట్రాలకు అత్యంత కీలకంగా ఉంది. 215 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న ఈ ప్రాజెక్టు అటు జలవిద్యుత్తు, ఇటు సాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు,దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు నీటి ప్రవాహన్ని అందిస్తుంది. కనీసం 100 టీఎంసీలైనా శ్రీశైలం ప్రాజెక్టులోకి వస్తే కానీ దిగువన ఉన్న నాగార్జునసాగర్‌ ఆయకట్టు రైతులకు వ్యవసాయ పనులు ప్రారంభించే అవకాశం లేదు.అయితే ఇప్పటివరకు శ్రీశైలంలోకి వచ్చింది కేవలం 1.3 టీఎంసీలు మాత్రమే. గతంలో కూడా శ్రీశైలం ప్రాజెక్టుకు చాలా సార్లు ఇలాంటి దుస్థితి ఎదురైనా, ఆలమట్టిలోకి ఎంతో కొంత ప్రవాహం ఉండేది. కానీ ఈసారి ఇప్పటివరకు ఆలమట్టిలోకి చుక్కనీరు రాకపోవడంతో రోజురోజుకూ ఆందోళన తీవ్రమవుతోంది.

ఇక ఈ సంవత్సరం నీటి ప్రవాహం ఎలా ఉంటుందన్నది సస్పెన్స్‌గా మారింది.ఆలమట్టిలోకి ప్రవాహం మొదలైతే కానీ చెప్పలేని పరిస్థితి. మొత్తం మీద కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు మరోసారి తీవ్ర నీటి సంక్షోభం ఎదురయ్యే అవకావం కనిపిస్తోంది. దీంతో ఈ సారి కృష్ణా బేసిన్‌లో పరిస్థితులు ఎలా ఉండనుందో అని నీటిపారుదల శాఖ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story