Nellore District: టిడ్కో ఇళ్ల పంపిణీలో దగా

Nellore District: టిడ్కో ఇళ్ల పంపిణీలో దగా
ఇద్దరికే ఇంటి తాళాలు , లబ్ధిదారుల నిరసనలు

Nellore : ఇల్లు వస్తుందని ఎంతో ఆశగా నెల్లూరు టిడ్కో ( TIDCO) గృహాల ప్రారంభోత్సవానికి వచ్చిన లబ్ధిదారులకు నిరాశే మిగిలింది. టిడ్కో గృహాలను అట్టహాసంగా ప్రారంభించిన వైకాపా ప్రజాప్రతినిధులు తాళాలు ఇద్దరికే ఇచ్చారు. మిగిలిన లబ్ధిదారులెవరికీ ఇవ్వకుండానే వెళ్లిపోయారు. ఇళ్లు అందరికీ ఇవ్వనపుడు ఎందుకు పిలిపించారంటూ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నెల్లూరు అల్లీపురం వద్ద టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవంలో గందరగోళం నెలకొంది. మంత్రులు ఆదిమూలపు సురేష్, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి... శిలాఫలకాన్ని ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేసి ఇళ్లను ప్రారంభించారు. 15 వేలకు పైగా ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తున్నామని... గొప్పలు చెప్పుకున్నారు. ఆ తర్వాత కేవలం ఇద్దరికీ మాత్రమే.. ఇంటి తాళాలు ఇచ్చారు. మిగిలినవారికి సచివాలయం ద్వారా వాలంటీర్లు అందజేస్తారని చెప్పి వెళ్లిపోయారు. ప్రజాప్రతినిధుల వైఖరితో లబ్ధిదారులు ఆగ్రహోదగ్రులయ్యారు. ఓ వృద్ధురాలు బాధతో కన్నీళ్లు పెట్టుకుంది. వైకాపా సర్కారు ఇచ్చిన పత్రాలను ఓ వ్యక్తి సభా వేదిక వద్దే చించి పారేశాడు. ఇంకెన్నిసార్లు తిప్పించుకుంటారంటూ మండిపడ్డాడు.


నెల్లూరు నగరం పరిధిలో ఆరు చోట్ల రూ.900 కోట్లతో 15,552 టిడ్కో ఇళ్లను నిర్మించారు. టిడిపి ప్రభుత్వ హయాంలోనే ఈ ఇళ్లు దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. అప్పట్లోనే కొందరి లబ్ధిదారులకు ఇంటి తాళాలను అధికారులు అందజేశారు. ఆ తర్వాత వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ఇళ్లను తమకు అప్పగించాలని లబ్ధిదారులు గత నాలుగన్నర సంవత్సరాల నుంచి కోరుతున్నారు. లబ్ధిదారులకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేపట్టాయి. అయినా, ప్రభుత్వం స్పందించలేదు. ఎన్నికల సమీపిస్తుండడంతో పనులు పూర్తి చేయకుండానే టిడ్కో గృహాల పంపిణీని తూతూమంత్రంగా బుధవారం చేపట్టారు. నెల్లూరు నగరంలోని ఆరు ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులను అల్లీపురం టిడ్కో ఇళ్ల వద్దకు అధికారుల, వైసిపి నాయకులు రప్పించారు. ఇంటి పట్టాలతోపాటు తాళాలూ అందిస్తారనే నమ్మకంతో వేలాది మంది లబ్ధిదారులు ఉదయం ఎనిమిది గంటలకే తరలివచ్చారు. మంత్రులు ఆదిమూలం సురేష్‌, కాకాణి గోవర్థన్‌రెడ్డి, ఎంపి ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుదీర్ఘ ఉపన్యాసం తరువాత ఇద్దరు, ముగ్గురికి మాత్రమే పట్టాలిచ్చి, తాళాలు అందించి ఫొటోలు తీయించుకొని అక్కడి నుంచి మంత్రులు వెళ్లిపోయారు. మిగిలిన వారికి పట్టాలు ఇవ్వలేదు. గంటల కొద్దీ నిరీక్షించిన పట్టాలు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఇళ్లు నిర్మిస్తే, వాటి పంపిణీలో తీవ్ర జాప్యం చేస్తూ వచ్చారని, ఇప్పుడు పిలిచి పట్టాలు ఇవ్వకుండా మాటలు చెబుతున్నారని, పేదలను రాజకీయాలకు, ఓట్లకు మాత్రమే వాడుకుంటున్నారని ఆవేదన చెందారు.

Tags

Read MoreRead Less
Next Story