ఏపీలో తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్!

ఏపీలో తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 30వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 31వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. ఏప్రిల్ 3 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. ఏప్రిల్ 17న పోలింగ్ జరుగుతుంది. మే 2న కౌంటింగ్ ఉంటుంది. తిరుపతి బైపోల్ ను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కరోనాతో చనిపోవడంతో తిరుపతి పార్లమెంట్ స్థానం ఖాళీ అయింది. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది.
ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీడీపీ. అందరికంటే ముందుగా పార్టీ అభ్యర్ధిగా పనబాక లక్ష్మి పేరును ప్రకటించారు అధినేత చంద్రబాబు. మరోవైపు.. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది టీడీపీ. పార్టీ సీనియర్లతో.. ఆదివారం నెల్లూరులోనూ సమావేశమై ఉపఎన్నికపై చర్చించారు. ఇప్పుడు తిరుపతిలో మరోసారి పార్టీ సీనియర్లు చర్చలు జరిపారు. ఈ సమావేశానికి యమనల రామకృష్ణుడుతో పాటు పలువురు పార్టీ సీనియర్లు హాజరయ్యారు. ఎన్నిక సజావుగా జరిగితే తిరుపతి ఎంపీ స్థానం టీడీపీదేనన్నారు యనమల రామకృష్ణుడు. ఉప ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టకుండా, దౌర్జన్యాలకు దిగకుండా జగన్ ఎన్నికల్లోకి వెల్లగలడా అంటూ ప్రశ్నించారు.
మరోవైపు అధినేత చంద్రబాబు ఇటీవలే సీనియర్లతో చర్చించారు. ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల్లో ఇంచార్జ్ లు గట్టిగా పని చెయ్యకపోతే చర్యలు ఉంటాయన్నారు. రానున్న ఎన్నికల్లో సీట్లు ఇవ్వాలన్నా....ఇంచార్జ్ లుగా కొనసాగాలన్నా ఈ ఉపఎన్నికే కొలమానమన్నారు. క్షేత్రస్థాయిలో నాయకులు పనిచేయకుండా కబుర్లు చెప్తే కుదరదని హెచ్చరించారు. అంతేకాదు.. ఒక్కో క్లస్టర్ కు 30 బూతులు ఉండేలా తిరుపతిని మొత్తం 70 క్లష్టర్లుగా విభజించారు. ఈ క్లస్టర్లకు సీనియర్ నేతలను ఇంచార్జ్ లుగా నియమించారు. ఎన్నికల ప్రక్రియను సమన్వయ పరిచేందుకు ఐదుగురితో కమిటీ ఏర్పాటు చేశారు. అచ్చెంనాయుడు, సోమిరెడ్డి, లోకేష్, బీద రవిచంద్రతో పాటు.. పనబాక కృష్ణయ్య ఈ కమిటీలో ఉంటారు.
మరోవైపు.. డాక్టర్ గురుమార్తిని బరిలోకి దింపుతోంది వైసీపీ. సిట్టింగ్ స్థానం కావడంతో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది వైసీపీ. బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు కల్యాణ్ చక్రవర్తికి టికెట్ ఇస్తారని మొదట భావించారు. అయితే అతనితో చర్చించిన అనంతరం జగన్ వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తిని ఖరారు చేశారు. జగన్ పాదయాత్ర సమయంలో గురుమూర్తి వెంటే నడిచారు. జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా పేరొందారు. శ్రీకాళహస్తికి చెందిన గురుమూర్తి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డికి వీరాభిమాని. జగన్ పిలుపుతో ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు.
మరోవైపు...బీజేపీ- జనసేన అభ్యర్థి ఎవరనేది ఉత్కంఠగా మారింది. టికెట్ ఆశిస్తున్నవారిలో దాసరి శ్రీనివాసులు, రత్నప్రభ, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు ఉన్నారు. ఐతే ఆదివారం ప్రకటించిన తిరుపతి ఉప ఎన్నిక ప్రచార కమిటీ సభ్యులుగా దాసరి శ్రీనివాసులుతో పాటు రావెల కిషోర్ బాబు కి ప్రచార బాథ్యతలు అప్పగించారు. దీంతో రేసులో రత్నప్రభ ఒక్కరే నిలిచారు. దీంతో రత్న ప్రభ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే...బీజేపీ హైకమాండ్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. పంచాయితీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపకున్నా, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో మాత్రం సత్తా చాటుతామంటోంది బీజేపీ. అయితే... ప్రధాన పోరు మాత్రం వైసీపీ, టీడీపీ మధ్యే ఉండబోందంటున్నారు రాజకీయవిశ్లేషకులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com