తెలంగాణతోపాటు ఏపీలోనూ రాజుకుంటున్న రాజకీయ వేడి

తెలంగాణతోపాటు ఏపీలోనూ క్రమంగా రాజకీయ వేడి రాజుకుంటోంది. తిరుపతి లోక్‌సభకు జరగబోయే ఉపఎన్నిక అప్పుడే కాక పుట్టిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి మద్దతిచ్చేందుకు కమిటైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్... ప్రస్తుతం ఢిల్లీలో మకాం వేశారు. తిరుపతి లోక్‌సభ సీటు కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారు. మంగళవారం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో చర్చించిన పవన్ కళ్యాణ్.. బుధవారం కూడా పలువురు ఇతర బీజేపీ నేతలతో భేటీ కానున్నారు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో తమకు ఓట్లు ఎక్కువ ఉన్నాయని జనసేన నేతలు లెక్కలు చెబుతున్నారు. బీజేపీ, జనసేన పొత్తు బలంగా ఉండాలంటే... తమ పార్టీకి కూడా బీజేపీ ప్రాధాన్యత ఇవ్వాలని జనసేన కోరుతున్నట్టు తెలుస్తోంది.
తిరుపతి సీటు విషయంలో బీజేపీ నాయకత్వం ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో బీజేపీనే పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేయడం దీనికి బలం చేకూరుస్తోంది.
ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాకపోయినా అభ్యర్ధిని ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అకాల మరణంతో జరగనున్న ఈ ఉపఎన్నికలో వైసీపీ, టీడీపీ ఎవరికి వారే గెలుపుకోసం వ్యూహరచనలో ఉన్నారు. ఇక్కడ బలం చాటి ఏపీలో బలపడాలన్నది బీజేపీ వ్యూహంగా కనపడుతోంది.పవన్ ఢిల్లీ టూర్ తర్వాత జనసేన పోటీ చేసే అంశంపై మరింత క్లారిటీ రానుంది.