LOKESH: నేడే యువగళం విజయోత్సవ సభ

LOKESH: నేడే యువగళం విజయోత్సవ సభ
హాజరుకానున్న చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌.... ఆరు లక్షల మంది తరలివస్తారని అంచనా....

విజయనగరం జిల్లా పోలిపల్లిలో నిర్వహించనున్న యువగళం విజయోత్సవ సభకు తెలుగుదేశం పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. సభా ప్రాంగణం టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలతో పసుపుమయమైంది. ఈ వేదిక నుంచి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సమర శంఖారావం పూరించేందుకు టీడీపీ-జనసేన సిద్ధమయ్యాయి. సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్‌ నాయకులు, నందమూరి, నారా కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఇరుపార్టీల అధినేతలు ఒకే బహిరంగ వేదికను పంచుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రణాళికపై ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉంది.


ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను 20 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లిందని.., నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించలేకపోయిందని.. ప్రధానంగా యువత తరపున టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరిట ఈ ఏడాది జనవరి 27న పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 226 రోజుల పాటు పర్యటించి విశాఖ జిల్లాలో ఈ నెల 18న ముగించారు. యాత్రలో అడుగడుగునా జనం., లోకేష్ కు నీరాజనాలు పలికారు. పాదయాత్ర విజయవంతమైన సందర్బంగా విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో యాత్ర చేపట్టలేకపోయారు. అందుకే విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.


ఈ సభ నిర్వహణ ఏర్పాట్లకు ప్రత్యేక కమిటీలను నియమించారు. మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప రోజంతా ఇక్కడే ఉండి వేదిక ఏర్పాట్లను పర్యవేక్షించారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడుతో పాటు., పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు, మాజీ మంత్రులు, యనమల రామకృష్ణ, చింతకాయల అయన్నపాత్రుడు, దేవినేని ఉమ, పీతల సుజాత, టీడీపీ నేతలు పట్టాభిరామ్, గోరంట్ల బుచ్చయ చౌదరి తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. యువగళం పాదయాత్ర ముగింపు సభ టీడీపీ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోనున్నదని పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

యువగళం విజయోత్సవ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల మంది టీడీపీ శ్రేణులు తరలివస్తున్నందున ఏ లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేయాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే సదరు నిర్వాహకులకు దిశానిర్దేశం చేశారు. దీంతో ఈ సభకు ఏడు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. చిత్తూరు, తిరుపతి, రైల్వేకోడూరు, అనంతపురం, ఆదోని, నెల్లూరు, మాచర్ల నుంచి ప్రత్యేక రైళ్లు బయల్దేరాయి. ఒక్కో రైలులో 1300 మంది వరకు ఈ సభకు చేరుకోనున్నారు. వీటితో పాటు ఇతర ప్రాంతాలు నుండి పెద్ద ఎత్తున బస్సుల్లో కూడా రానున్నారు. దీంతో ఒక వైపు రైల్లు, మరో వైపు బస్సుల్లో పెద్ద యెత్తున టీడీపీ శ్రేణులు ఈ సభకు హాజరవనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story