TTD: నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపింది నిజమే

TTD: నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపింది నిజమే
X
టీటీడీ ఈవో శ్యామలరావు స్పష్టీకరణ... హెచ్చరించినా ఏ ఆర్ డెయిరీ మారలేదని వెల్లడి

తిరుమల లడ్డూ ప్రసాదంపై భక్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో.. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కంపెనీలను ముందుగానే హెచ్చరించామని టీటీడీ ఈవో శ్యామలరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదించారు. కొన్ని కంపెనీలు సరేనన్నా.. ఏఆర్‌ డెయిరీ ఫుడ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ తక్కువ నాణ్యత గల నెయ్యి సరఫరా చేసిందని తెలిపారు. నాసిరకం ట్యాంకర్లు పంపిందని.. అనుమానం వచ్చి గోప్యంగా పరీక్షలు చేయించామని తెలిపారు. జంతువుల కొవ్వు కలిసినట్లు రిపోర్టుల్లో తేలడంతో ఆ కంపెనీ నుంచి మొత్తం సరఫరానే నిలిపివేశామని వెల్లడించారు. ప్రాథమిక నివేదికను చంద్రబాబుకు అందించారు. టీటీడీ ల్యాబ్‌లో కల్తీ నెయ్యిని పరీక్షించే పరికరాలు లేవని తెలిపారు.

ప్రమాణాల మేరకు లేనందునే...

భారత ఆహార భద్రత-ప్రమాణాల అథారిటీ నాణ్యత ప్రకారం నెయ్యి ఉందా లేదా అన్న నిర్ధారణ కోసం అత్యంత గోప్యంగా గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపించామని టీటీడీ ఈవో తెలిపారు. అదే నెల 16, 23వ తేదీల్లో నివేదికలు వచ్చాయన్నారు. సదరు కంపెనీ సరఫరా చేసిన నెయ్యిలో వెజిటబుల్‌, జంతువుల కొవ్వు ఆధారిత కల్తీ పదార్థాలున్నట్లు తేలిందన్నారు. వెంటనే కల్తీ నెయ్యి ట్యాంకర్లను సదరు డెయిరీకి వెనక్కి పంపించేశామని.. ఆ కంపెనీ నుంచి మొత్తం సరఫరాయే నిలిపివేశామని తెలిపారు. నెయ్యి కల్తీ సమస్య నేపథ్యంలో వెంటనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని టీటీడీ ఈవో వెల్లడించారు. ప్రస్తుతం నెయ్యి కొరత లేకుండా కొన్ని తాత్కాలిక చర్యలు తీసుకున్నాం. టెండర్లు ఆహ్వానించగా నాలుగు డెయిరీ కంపెనీలు పాల్గొన్నాయన్నారు.

టీటీడీ ఈవో కీలక వ్యాఖ్యలు..

తిరుమలలో కల్తీ నెయ్యి విషయం భక్తులను ఆందోళన కలిగించిందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం ఆవు నెయ్యి తీసుకునే విధానంలో మార్పు తెచ్చామన్న టీటీడీ ఈవో.. నందిని, ఆల్ఫా సంస్థల నుంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. కేజీ నెయ్యి రూ.475 లకు కొంటున్నామని చెప్పారు. ప్రస్తుతం లడ్డూ తయారీకి సరఫరా అవుతున్న నెయ్యిని కూడా ఎన్‌డీబీబీకి పంపామన్న శ్యామలరావు.. రిపోర్టు సైతం స్వచ్ఛమైన నెయ్యిగా నిర్ధారించిందన్నారు. ఎనేబియల్ ల్యాబ్స్‌కు నెయ్యిని ఎప్పటికప్పుడు టెస్టింగ్ కు పంపిస్తున్నామని తెలిపారు.

Tags

Next Story