PAWAN: లడ్డూ కల్తీ నిందితులపై కఠిన చర్యలు తీసుకోండి
![PAWAN: లడ్డూ కల్తీ నిందితులపై కఠిన చర్యలు తీసుకోండి PAWAN: లడ్డూ కల్తీ నిందితులపై కఠిన చర్యలు తీసుకోండి](https://www.tv5news.in/h-upload/2024/09/22/1364050-4.webp)
మంగళగిరి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ అయ్యారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశంపై పవన్ ఆరా తీశారు. కల్తీ నెయ్యి అనుమతించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు. గత పాలకమండలి హయాంలో ప్రసాదంలో కల్తీ జరిగినట్లు ఈవో వివరించారు. తితిదే తరఫున సంప్రోక్షణ చర్యల గురించి తెలిపారు. భక్తుల మనోభావాలు, ధార్మిక అంశాల్లో రాజీ వద్దని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'గత ప్రభుత్వంలో రథాలు తగులబెట్టారు. ఆలయాలను అపవిత్రం చేశారు. రాముడి విగ్రహంలో తల తొలగిస్తే ఆనాడు పోరాడాము. ఏ మతమైనా సరే వారి మనోభావాలు దెబ్బతినకూడదు. ప్రసాదాలు కల్తి, నాణ్యత లేమి గురించి గతంలోనే చెప్పాము.' అంటూ పవన్ వ్యాఖ్యానించారు.
పవన్‌కు మద్దతుగా మాల ధరించిన నాయకులు
తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం అపవిత్రం కావడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారి ఆలయ సన్నిధిలో మండల నాయకులు కంకిపాటి నరసింహారావు, బర్ల సతీష్ కుమార్, తుండూరి బుజ్జి గోవింద మాల ధరించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండలాధ్యక్షుడు జేఎస్సార్, తాతకాపు, తదితరులు పాల్గొన్నారు.
లడ్డూ కల్తీపై సిట్
లడ్డు కల్తీ వ్యవహారంపై ఐజీ, ఆపై స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిరుమల శ్రీవారి ప్రసాదాలలో కల్తీ చేసి ఘోరమైన అపచారం చేశారని గత వైసీపీ పాలకులపై చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వెళ్తుండగా అప్పుడే తన మీద దాడి జరిగిందని చంద్రబాబు గుర్తు చేశారు. అప్పుడు సాక్షాత్తూ భగవంతుడే తనని కాపాడాడు అని అన్నారు. అందుకే ఏ పనిచేసినా వెంకటేశ్వరస్వామిని తలుచుకుంటానని చంద్రబాబు వెల్లడించారు. స్వామి వారికి అపచారం జరిగిందని.. వెంకటేశ్వరస్వామి అకౌంట్స్ సెటిల్ చేస్తాడని అన్నారు. వైఎస్సార్ హయాంలో 7 కొండలను 5 కొండలు అనడాన్ని తీవ్రంగా వ్యతిరేకించానని... ఆ తరువాత తాను పాదయాత్ర చేశానని చంద్రబాబు గుర్తు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com