Vangalapudi Anitha : ప్రజలు దాడి చేస్తారని జగన్‌కు భయం: వంగలపూడి అనిత
వైసీపీ చీఫ్ జగన్ సెక్యూరిటీని తగ్గించలేదని, భద్రత తగ్గించారంటూ ఆయన అనవసర రాద్ధాంతం చేస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత ( Vangalapudi Anitha ) అన్నారు. సెక్యూరిటీ లేకపోతే ప్రజలు దాడి చేస్తారనే భయంతోనే ఆయన అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 20వేల మంది పోలీసుల కొరత ఉంటే ఆయనకు 900 మంది సెక్యూరిటీ కావాలా అని మండిపడ్డారు. రాజమండ్రి సెంట్రల్ జైలును హోంమంత్రి అనిత సోమవారం పరిశీలించారు. జైలు ఆధ్వర్యంలో పెట్రోలు బంక్‌ను ప్రారంభించిన అనంతరం.. సెంట్రల్ జైలులో ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్నేహ బ్లాక్ వద్దకు వెళ్లాక హోం మంత్రి భావోద్వేగానికి గురయ్యారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును జైలుకు పంపించడాన్ని ఆమె గుర్తుకు తెచ్చుకున్నారు. తమ నాయకుడిని 53 రోజులు అన్యాయంగా జైల్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజులు గుర్తుకువచ్చి బాధగా అనిపిస్తుందని అన్నారు. వైసీపీ పాలనలో అక్రమ కేసులకు చంద్రబాబు కూడా బాధితుడిగా మారారని పేర్కొన్నారు. అక్రమ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు పాతాళానికి పడిపోయాయని తెలిపారు. వాళ్ల పాపాలు పండాయని.. అందుకే జన నాయకుడిని బాధపెట్టిన వైసీపీని పాతాళానికి తొక్కేలా ప్రజలు బలమైన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com