AP: విశాఖ ఉక్కు కార్మికుల మహాపాదయాత్ర

AP: విశాఖ ఉక్కు కార్మికుల  మహాపాదయాత్ర
విశాఖ ఉక్కు పరరిక్షణకు కదంతొక్కిన కార్మిక సంఘాలు....మేనిఫేస్టోలో చేర్చాలని పార్టీలకు వినతి

విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు' అంటూ... కార్మికులు కదం తొక్కారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం నుంచి... G.V.M.C వరకు మహాపాదయాత్ర నిర్వహించారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్లు అన్ని రాజకీయ పార్టీలు.... మేనిఫెస్టోలో పెట్టాలని కార్మికులు డిమాండ్ చేశారు. వారికి మద్దతుగా వివిధ రాజకీయ పార్టీల నేతలు యాత్రలో పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌తో కార్మిక సంఘాలు మహాపాదయాత్ర చేపట్టాయి. స్టీల్ ప్లాంట్ నుంచి... జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు యాత్ర సాగింది. కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పెద్దసంఖ్యలో పాదయాత్రలో పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తక్షణమే ఉపసంహరించుకోవాలని నినాదాలు చేస్తూ పాదయాత్ర కొనసాగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మకై ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేస్తున్నాయని కార్మికులు మండిపడ్డారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.


కార్మికులు చేపట్టిన మహాపాదయాత్రకు... వివిధ రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. తెలుగుదేశం నేత భరత్‌తో పాటు విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జనసేన, వామపక్షాల నేతలు యాత్రలో పాల్గొన్నారు. కార్మికుల పోరాటానికి మద్దతుగా నిలిచారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపకపోవడం వల్లే... ఉక్కు పరిశ్రమకు ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడి తేవడంలో జగన్‌ సర్కార్‌ పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు

Tags

Read MoreRead Less
Next Story