AP News: యథేచ్ఛగా వైపీపీ నేతల ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలు

AP News: యథేచ్ఛగా వైపీపీ నేతల ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలు
ఎన్నికల నియమావళిని అపహాస్యం చేస్తున్న వైసీపీ నేతలు... ప్రతిపక్షాల తీవ్ర విమర్శలు..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నియమావళిని వైసీపీ నేతలు అపహాస్యం చేస్తున్నారు. నిబంధనలకు యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ... ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. వైసీపీ నేతల తాయిలాలపై ఈసీకి ఫిర్యాదు చేసినా సరైన చర్యలు తీసుకోవడం లేదని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లూ ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఎమ్మెల్యేలతో కలసి ఎన్నికల ప్రచారాల్లో భాగమవుతున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తాడేపల్లి ప్యాలెస్ పెద్దల డైరెక్షన్‌లోనే తాయిలాలను డంప్ చేస్తున్నారని తెలుగుదేశం ఆంధ్రప్రదేస్‌ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. రేణిగుంట గోదాంలో వైసీపీకు సంబంధించిన డంప్‌ బట్టబయలైనా.... ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇలాంటి డంప్‌లు రేణిగుంటలో 4 ఉన్నాయని తెలుగుదేశం నేతలు సాక్ష్యాధారాలతో సహా నిరూపించినా అధికారులు స్పందించకపోవడం వెనుక తాడేపల్లి పెద్దల ఒత్తిళ్లు ఉన్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

తాయిలాల మాటున ఓటర్లను ప్రభావితం చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చంద్రగిరి అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని.... ఇద్దరిని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదని తేలడంతో తాయిలాలతో ఓటర్లను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ మండిపడ్డారు. తెలుగుదేశం ఫిర్యాదుతో ఎట్టకేలకు తాయిలాల డంప్‌ను పట్టుకున్నారని.... ఇసుక, లిక్కర్ లో జగన్ దోచుకుని ఎన్నికల్లో పంచేందుకు సిద్ధంచేసిన డబ్బుల డంప్‌ను ఎప్పుడు పట్టుకుంటారని ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటికి కేజీ బంగారం ఇచ్చినా ప్రజల్లో నెలకొన్న ప్రజాగ్రహ జ్వాలలను అడ్డుకోవడం సాధ్యం కాదని జగన్ గుర్తించాలని హితవు పలికారు.

రేణిగుంట గోదాములో దొరికిన డంప్‌పై ఈసీ తక్షణమే చర్యలు తీసుకోవాలని... శ్రీకాళహస్తి తెలుగుదేశం అభ్యర్థి బొజ్జల సుధీర్‍ రెడ్డి డిమాండ్‍ చేశారు. సీజ్ చేసిన తాయిలాల డంప్ ను తెలుగుదేశం నేతలతో కలిసి బొజ్జల పరిశీలించారు

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో పలువురు ఎంఎల్ఓలు, వాలంటీర్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వజ్రకరూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా స్థానిక వాలంటీర్లు ఎమ్మెల్యే అభ్యర్థితో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఉరవకొండ 11వ వార్డులో వైకాపా కార్యకర్తలు... విద్యుత్ స్తంభాలు, వాటర్ ట్యాంకులను సైతం వదలకుండా స్టిక్కర్లు అతికించటంపై స్థానికులు మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story