YCP: వైసీపీ నేతలకి వింత నిరసనలు

YCP: వైసీపీ నేతలకి వింత నిరసనలు
ఓటుకు నోటు ఇవ్వలేదంటూ నేతల ఇళ్లు ముట్టడించిన ఓటర్లు... ఆఫీసుల ముందు భైఠాయింపు

ఆంధ్రప్రదేశ్‌లో ఓటుకు నోటు ఇస్తామని చెప్పి... ఓటర్లను మోసం చేసిన వైసీపీ నేతలకు... ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోవటంతో కొన్ని ప్రాంతాల్లో వైసీపీ నాయకుల ఇల్లు, ఆఫీసుల ముందు బైఠాయించి ఓటర్లు నిరసన తెలిపారు. డబ్బులు ఇచ్చేవరకు కదిలేదే లేదని భీష్మించుకు కూర్చున్నారు. వైసీపీ నేతల తీరును చూసి సామాన్యులు నవ్వుకుంటున్నారు.


గుంటూరు జిల్లా మంగళగిరిలో... ఓటర్లుకు డబ్బుల పంపిణీ సక్రమంగా చేయడం లేదంటూ... వైసీపీ నేతల ఇళ్ల ముందు ప్రజలు నిరసన తెలిపారు. వైసీపీ M.L.C. మురుగుడు హనుమంతరావు, మాజీ M.L.A. కాండ్రు కమల ఇంటి వద్దకు వెళ్లారు. అందరికీ డబ్బులు ఇచ్చి మాకెందుకు ఇవ్వటం లేదని... సుమారు వందమంది మహిళలు ఆందోళన చేశారు. ద్వితియ శ్రేణి నాయకులంతా తమకు పంచాల్సిన డబ్బులను దాచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు డబ్బులు ఎందుకు పంచలేదంటూ... కొన్ని వార్డులకు చెందిన మహిళలు వైసీపీ నాయకులను నిలదీశారు. M.L.A. ఆళ్ల రామకృష్ణారెడ్డి తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు నచ్చిన వారికే డబ్బులు పంపిణీ చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి... ఉష శ్రీచరణ్‌ కార్యాలయం ముందు... దుర్గాపేటకు చెందిన ముస్లిం ఓటర్లు ఆందోళనకు దిగారు. ఓటుకు డబ్బులు ఇస్తామంటూ కూపన్లు పంపిణీ చేసి... ఇవ్వకుండా తమను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉష శ్రీచరణ్‌ ఫొటోతో ఉన్న కూపన్లను పట్టుకుని వైసీపీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. రాత్రి సమయంలో కుర్చీలు వేసుకుని మరీ ఉష శ్రీచరణ్‌కోసం ఎదురు చూశారు. ఇంటికి తాళం వేసి ఉండటం... తమను ఎవరూ పట్టించుకోకపోవటంతో వారంతా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తమకు కావాల్సినవారికే డబ్బులు పంపిణీ చేసి మిగిలిన వారిని ఇలా మోసం చేస్తున్నారని స్థానిక ముస్లింలు ఉష శ్రీచరణ్‌పై మండిపడ్డారు.

కోనసీమ జిల్లా కొత్తపేట వైసీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి ఇచ్చిన చీరలు మాకొద్దంటూ ఆలమూరు మండలం పెనికేరు గ్రామ మహిళలు ర్యాలీ చేశారు. ఆత్రేయపురం మండలంలోని పలుగ్రామాల మహిళలు డబ్బులు ఇవ్వాలంటూ వైసీపీ నేతల ఇళ్లకు వెళ్లి చీరలను వెనక్కి ఇచ్చారు. డబ్బులు ఇవ్వకుండా చీరలు ఎందుకిచ్చారని మహిళలు ఆందోళన చేపట్టారు.

Tags

Next Story