AP: రాజ్యసభకు వెళ్లే నేతలెవరు..?

AP: రాజ్యసభకు వెళ్లే నేతలెవరు..?
నాగబాబును రాజ్యసభకు పంపడం ఖాయం.. టీడీపీ నుంచి భారీగా ఆశావహులు

ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ పోస్టుల సందడి నెలకొంది. వైసీపీకి ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి టీడీపీలో చేరడంతో ఆ మూడు స్థానాల్లో ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపైనే విస్తృత చర్చ జరుగుతోంది. కూటమి నుంచి రాజ్యసభకు వెళ్లే నేతలెవరు? జనసేనాని బ్రదర్‌ నాగబాబు కేంద్రమంత్రి కాబోతున్నారా అన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జనసేనకు దక్కే ఒకే రాజ్యసభ సీటులో.. నాగబాబును రాజ్యసభకు పంపాలని పవన్ కల్యాణ్ డిసైడ్ అయినట్లు నేతలు అనుకుంటున్నారు.

ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు రిజైన్ చేయడంతో సీఎం చంద్రబాబు బాబు మార్క్ పాలిటిక్స్‌తో ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మూడు సీట్లు టీడీపీ కూటమికే దక్కనున్నాయి. దీంతో ఇప్పుడు పెద్దల సభకు వెళ్లే ఆ ముగ్గురు కూటమి నేతలు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.ఏపీ నుంచి 11 మంది వైసీపీ నేతలనే ఎంపీలుగా ఉన్నారు. మొత్తం కోటా అంతా వైసీపీతో భర్తీ అయింది. దాంతో టీడీపీకి ప్రాతినిధ్యం లేదు. ఈ పరిణామంతో నిరాశ చెందిన టీడీపీ అధికారంలోకి రాగానే తన మార్క్‌ పాలిటిక్స్‌తో పావులు కదిపింది. దానికి తగినట్లుగా వైసీపీ నుంచి రియాక్షన్ వచ్చింది. జగన్ ఎవరి మీద అయితే నమ్మకంతో పదవులు ఇచ్చారో వారే ఫ్యాన్‌ పార్టీకి బైబై చెప్పి మరీ సైకిలెక్కేశారు. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు సైకిల్ ఎక్కాలనుకుంటే.. ఆర్‌.కృష్ణయ్య మాత్రం బీజేపీలోకి వెళ్తారని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే ఈ మూడు ఖాళీల్లో చంద్రబాబు ఎవరిని తీసుకుంటారనేది చర్చకు దారి తీసింది. మూడు సీట్లు ఖాళీగా ఉంటే నాలుగురైదుగురు నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. టీడీపీకి దక్కే స్థానాల కోసం ఇటీవల ఎన్నికల్లో సీట్లు కోల్పోయిన దేవినేని ఉమా, యనమల రామకృష్ణుడు, అశోక్‌ గజపతిరాజు పేర్లు వినిపిస్తున్నాయి.

పేర్లు ఖరారయ్యాయా..?

ప్రచారంలో ఎందరి పేర్లున్నా..పెద్దల సభకు వెళ్లే ఆ ముగ్గురిని చంద్రబాబు ఇప్పటికే ఎంపిక చేశారని తెలుస్తోంది. టీడీపీకి రెండు ఎంపీలు, జనసేనకు ఒకటి ఇస్తున్నారని అంటున్నారు. ఆ విధంగా తొలిసారి జనసేన పెద్దలసభలో అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ రెండు, జనసేన ఒకటి తీసుకుంటే బీజేపీ పరిస్థితి ఏంటన్నదానిపై క్లారిటీ లేదు. అయితే బీజేపీకి ఈసారికి నచ్చచెబుతారని ఎమ్మెల్సీ కోటాలో చాన్స్ ఇస్తారని అంటున్నారు. ఇక టీడీపీ దక్కే సీట్లలో ఒకటి మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌కి, కేంద్ర మాజీమంత్రి, సీనియర్ టీడీపీ నేత అశోక్ గజపతిరాజుకు ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

నాగబాబు పక్కానా..

జనసేనకు దక్కే ఒకే రాజ్యసభ సీటులో.. నాగబాబును రాజ్యసభకు పంపాలని పవన్ కల్యాణ్ డిసైడ్ అయినట్లు నేతలు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో నాగబాబు అనకాపల్లి లోక్‌సభ సీటును ఆశించారు. కూటమి పొత్తుల్లో భాగంగా..అనకాపల్లి నుంచి బీజేపీ సీఎం రమేశ్‌కు టికెట్‌ ఇచ్చారు. అప్పుడు నాగబాబు సీటు త్యాగం చేశారు కాబట్టి ఇప్పుడాయనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పిస్తారని అంటున్నారు. ఇలా మూడు ఎంపీ సీట్లకు గానూ అభ్యర్ధులతో సహా ఎంపికలు పూర్తి అయ్యాయని చర్చ జరుగుతోంది. ఇక ఎన్నికల నోటిఫికేషన్ రావడమే ఆలస్యం ఈ ముగ్గురు నామినేషన్లు వేస్తే ఏకగ్రీవం కావడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags

Next Story