AP ROADS: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఘోరంగా రోడ్లు

AP ROADS: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఘోరంగా రోడ్లు
వాహనదారుల నరకయాతన.... చలనమే లేని జగన్‌ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో రహదారులు అత్యంత ఘోరంగా తయారయ్యాయి. గుంతల మధ్యలో రహదారి ఎక్కడుందో వెతుక్కొంటూ.. వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. అడుగుకో గుంతతో అనేక రహదారులు ఘోరంగా ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వంలో చలనం లేదు. కనీసం గుంతలు పూడ్చలేని దయనీయస్థితిలో ప్రభుత్వం ఉంది. ఇటీవల మిగ్‌జామ్‌ తుపాను 4 వేల 900 కిలోమీటర్ల రోడ్లను ధ్వంసం చేసింది. వీటి తాత్కాలిక మరమ్మతులకు 300 కోట్లు, శాశ్వత పనులకు 2 వేల 500 కోట్లు అవసరమని ఇంజినీర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇదే జగన్‌ ప్రభుత్వం హయాంలో గతంలో మాండస్, నివార్, గులాబ్‌ తుపాన్లతో వేలాది కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నా ఆ రోడ్లకు కూడా ఇంకా మోక్షం లభించలేదు. ఇప్పటికే ఏపీలో 9 వేల కిలోమీటర్ల మేర రోడ్లు ఘోరంగాను, 7వేల600 కిలోమీటర్ల మేర రోడ్లు గుంతలమయంగా ఉన్నట్లు గుర్తించారు. 1200 కోట్ల మేర బకాయిలు ఉండటంతో ఎక్కడా పనులు చేసేందుకు గుత్తేదారులు ఇష్టపడటం లేదు.


ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 45 వేల కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రహదారులు ఉండగా..... వీటిలో సగటున ఏటా9 వేల కిలోమీటర్లు పునరుద్ధరణ పనులు చేయాలి. కానీ వైసీపీ సర్కార్‌ 2022లో మాత్రమే 7 వేల 650 కిలోమీటర్ల మేర పునరుద్ధరించింది. దీనికి బ్యాంక్‌ నుంచి 2 వేల కోట్లు రుణం తీసుకొని గుత్తేదారులకు చెల్లించారు. న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంక్‌-N.D.B. రుణంతో చేపట్టిన... 1244 కిలోమీటర్ల విస్తరణ పనులు ఆగిపోయాయి. బ్యాంకు ఇచ్చిన రుణవాటా 230 కోట్లలో..210 కోట్లే ప్రభుత్వం చెల్లించింది. మిగిలిన సొమ్ము, రాష్ట్రవాటా ఇవ్వకుండా చోద్యం చూస్తోంది. గుత్తేదారులకు చెల్లింపులు లేక రెండున్నరేళ్లలో 20 శాతం పనులు మాత్రమే జరిగాయి. ఎన్నికల నేపథ్యంలో వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ బృందం ఐప్యాక్‌ సూచించిన. 3, 432 కిలోమీటర్లు పునరుద్ధరించేందుకు 1121 కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది.


వీటికి టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రావడంలేదు. గుత్తేదారులకు 12 వందల కోట్ల మేర బకాయిలు ఉండటంతో,వాటి సంగతి తేలిస్తేనే పనులుచేస్తామని తెగేసిచెబుతున్నారు. తిరుపతి జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గ పరిధిలో.... నాగలాపురం నుంచి పి.వి.పురం రోడ్డులో 19 కిలోమీటర్లు ఘోరంగా ఉంది. ఆటోలు సైతం అతికష్టం మీద ఈ మార్గంలో నడుపుతున్నారు. నాగులాపురం నుంచి చిన్నపాండూరు వరకు రహదారి పనులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 2021 ఆగస్టులో శంకుస్థాపన చేశారు. 49 కోట్లు సరిపోవంటూ గుత్తేదారులు.. పనులు మొదలు పెట్టకపోవడంతో ఐదు నెలల క్రితం టెండర్‌ రద్దు చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కావలి-తుమ్మలపెంట రహదారి చాలాకాలంగా అధ్వానంగా ఉంది. మిగ్‌జాం తుపానుతో కురిసిన వర్షాలకు మరింత ఘోరమైంది.

ఈ రహదారి నిర్మాణానికి NDB కింద 15కోట్లు మంజూరైనా పనులు చేపట్టలేదు. ప్రకాశం జిల్లాలో ఇటీవలి వర్షాలకు రహదారులు ధ్వంసం అయ్యాయి. ఒంగోలు, కొత్తపట్నం ప్రధాన రహదారిలో వంతెనల వద్ద ఎప్రోచ్‌ రోడ్డులు వేయకుండా గ్రావెల్‌ పోసి వదిలేశారు.వర్షాలకు ఆ గ్రావెల్‌ కూడా కొట్టుకుపోయి రాళ్లు తేలుతున్నాయి.మిగ్‌జాం తుపాను ప్రభావంతో పల్నాడు జిల్లాలోని పెదమద్దూరు వాగు సమీపంలో కిలోమీటరు మేర ఆర్‌అండ్‌బీ రహదారి కొట్టుకుపోయింది. పెద్దపెద్ద గుంతలు ఏర్పడి, ప్రమాదకరంగా మారడంతో మూడు రోజులుగా బస్సులు కూడా నిలిపేశారు. 14 నెలల కిందట 44 కోట్లతో వంతెన, రహదారి పనులకు మంత్రి జోగి రమేష్‌ శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ పనులు మొదలుకాలేదు. గుంటూరు-నందివెలుగు రహదారికి. చాలాకాలంగా మరమ్మతులు చేయడంలేదు.

Tags

Read MoreRead Less
Next Story