సీఎం జగన్ పాలన, వితండ వాదనలతో రాష్ట్రానికి తీరని చేటు : యనమల

సీఎం జగన్ పాలన, వితండ వాదనలతో రాష్ట్రానికి తీరని చేటు జరిగిందన్నారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. ఆ రోజున ఎన్నికలు కావాలని, ఈ రోజున వద్దని వాదించడం వితండం కాదా అని ప్రశ్నించారు. ఇలాంటి వితండ సీఎంను రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు చూడలేదున్నారు. కేంద్ర ఎన్నికల సంఘమే అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరుపుతోందని గుర్తు చేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు వద్దనడం వైసీపీ ఓటమి భయానికి నిదర్శనమన్నారు.
ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ పిలిచినప్పుడు వైసీపీ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఈసి భేటికి వెళ్లకుండా బైట ప్రకటనలు, ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటని నిలదీశారు. ఎన్నికల కోసం పెట్టిన సమావేశాన్ని అధికార పార్టీ బాయ్ కాట్ చేయడం చరిత్రలోఎక్కడైనా ఉందా అన్నారు. తన పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనేది జగన్‌కు అర్థమైందన్నారు. ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికల వాయిదా కోసం వైసీపీ పట్టుపడుతోందన్నారు.