JAGAN: పోలీసు అధికారికి జగన్ హెచ్చరిక

JAGAN: పోలీసు అధికారికి జగన్ హెచ్చరిక
X
నిబంధనలు అమలు చేసినందుకు బెదిరింపు... మధుసూధన్‌పై మండిపడ్డ వైసీపీ అధినేత

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ తొలి రోజు సమావేశాల్లోనే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ద్వారం వద్ద విధుల్లో ఉన్న ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. మెడలో నలుపురంగు కండువాలు, చేతిలో ప్లకార్డులతో అసెంబ్లీలోకి ప్రవేశం లేదని.. వాటిని బయట వదిలేసి వెళ్లాలని ఆపినందుకు మధుసూధన్‌ అనే అధికారిపై జగన్‌ మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి ఇలా పేపర్లను లాక్కుని చింపే అధికారం మీకు ఎవరు ఇచ్చారని మధుసూదన్‌రావ్‌ గుర్తుపెట్టుకో.. ఎల్లకాలం ఈ మాదిరిగా ఉండదని హెచ్చరించారు. మీ టోపీ మీదున్న సింహాలకు అర్థమేంటో తెలుసా? అధికారంలో ఉన్నవాళ్లకు సెల్యూట్‌ కొట్టడం కాదని జగన్‌ హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే మీరున్నారని గుర్తుపెట్టుకోవాలంటూ మండిపడ్డారు. నిబంధనల ప్రకారం సభ్యులు అసెంబ్లీలోకి ప్లకార్డులు, జెండాలు, నలుపు రంగు కండువాల్లాంటి వాటిని తీసుకువస్తే అనుమతించరు. అయినా జగన్‌ ఇలా మాట్లాడడంపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

సోమవారం జగన్‌ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమీపంలోని కూడలి నుంచి నడుచుకుంటూ అసెంబ్లీకి వచ్చారు. వారంతా మెడలో నలుపురంగు కండువాలు వేసుకుని, చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేస్తూ వచ్చారు. వారితోపాటు కొంతమంది సభ్యులు కానివారు కూడా ఉండడంతో.. పరిశీలించి సభ్యులను మాత్రమే పంపేందుకు, ప్లకార్డులను తీసుకువెళ్లరాదని చెప్పేందుకు వారిని భద్రతా సిబ్బంది గేటు వద్ద ఆపారు. దీంతో జగన్, ఆయనతోపాటు ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్సీలు భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ముగ్గురు, నలుగురు ఎమ్మెల్సీలు అక్కడే కింద కూర్చుని నిరసన తెలిపారు. భద్రతా సిబ్బంది.. సభ్యుల చేతుల్లో నుంచి ప్లకార్డులను తీసుకునే ప్రయత్నం చేశారు. తోపులాటలో కొన్ని ప్లకార్డులు చినిగిపోవడంతో జగన్‌.. వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు లోపలికి పోనివ్వరా చెప్పండి.. ఇక్కడ నుంచే బయటకు వెళ్లిపోతాం’ అని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం 50 రోజుల్లోనే అన్నింటా వైఫల్యం చెందిందని జగన్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో విమర్శించారు. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడితే వారు ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయలేమన్న గుట్టు బయటపడుతుందన్న భయంతో.. ప్రజల దృష్టిని మరల్చేందుకు రాష్ట్రంలో భయానక పరిస్థితిని తీసుకువస్తున్నారని అన్నారు.

Tags

Next Story