AP: ఏలూరులో వైసీపీకి బిగ్ షాక్
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే కీలక నేతలు వైసీపీకి గుడ్‌బై చెప్పగా తాజాగా... ఏలూరులోనూ బిగ్ షాక్ తగిలింది. ఏలూరు నగర మేయర్ నూర్జహాన్, ఎస్‌ఎంఆర్ పెదబాబు దంపతులు టీడీపీలో చేరనున్నారు. ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో ఈ నెల 27న ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్ సమక్షంలో వీరు టీడీపీ కండువా కప్పుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. నగర పాలక సంస్థకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు 30 మంది కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. వారు మేయర్ దంపతులతో కలిసి వెళ్లి చేరుతారా లేదా ఆ తరువాతా అనే దానిపై స్పష్టత లేదు. ఇప్పటికే ఎమ్మెల్యేతో సంప్రదింపులు జరిపారు. మరోవైపు మేయర్‌తో పాటు కార్పొరేటర్లు చేరితే ఏలూరు నగర పాలక సంస్థ టీడీపీ పరమవుతుందని అంతా భావిస్తున్నారు. మేయర్ భర్త ఎస్‌ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్ సమర్థత కలిగిన నాయకులని.. వారి సారథ్యంలో ఎమ్మెల్యే చంటి ఆధ్వర్యంలో నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.
ఏలూరు నగర మేయర్ నూర్జహాన్, ఎస్‌ఎంఆర్ పెదబాబు దంపతుల రాజకీయ ప్రస్థానం తెదేపాలోనే మొదలైంది. 2013లో అప్పటి టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బడేటి బుజ్జి.. నగర పాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో ఎస్‌ఎంఆర్ పెదబాబును పార్టీలో చేర్చుకుని ఆయన సతీమణి నూర్జహాన్‌ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. ఆ ఎన్నికల్లో ఆమె గెలిచి పీఠాన్ని అధిరోహించారు. అనంతర పరిణామాల్లో 2019 సాధారణ ఎన్నికలకు ముందు పెదబాబు దంపతులు వైసీపీలో చేరారు.
ఇప్పటికే కుప్పంలో బిగ్ షాక్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో వైఎస్సార్‌సీపీకి డబుల్ షాక్ తగిలింది. కుప్పంలో ఒక్కసారిగా సీన్ మారిపోతోంది.. ఓవైపు వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి చేరికలు జరుగుతున్నాయి. మరోవైపు మొన్నటి వరకు కళకళలాడిన కుప్పం బైపాస్ రోడ్డులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం.. హోటల్ అమరావతిగా మారిపోయోంది. ఎన్నికల తర్వాత కార్యాలయం ఖాళీ కావడంతో.. ఆ భవన యజమాని హోటల్‌గా మార్చేస్తున్నారు. త్వరలో హోటల్ అమరావతి ప్రారంభిస్తున్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అటు వైపుగా వెళుతున్న వారు ఈ మార్పు చూసి షాకవుతున్నారు.
మరోవైపు చంద్రబాబు సమక్షంలో కుప్పం మున్సిపాలిటీలో ఐదుగురు కౌన్సిలర్లు, 14 మంది ఎంపీటీసీలు తెలుగు దేశం పార్టీలో చేరారు. మరికొందరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. టీడీపీలో చేరిన వారిలో.. 1, 24 వార్డుల కౌన్సిలర్లు జగన్, సయ్యద్ అలీ ఉన్నారు. 4వ వార్డు కౌన్సిలర్ రాజమ్మ కుమారుడు రవి , 13వ వార్డు కౌన్సిలర్ హంస భర్త సోమశేఖర్, 21వ వార్డు కౌన్సిలర్ లావణ్య భర్త ఎంఆర్ సురేష్ టీడీపీలో చేరారు. వీరితో పాటుగా 14మంది ఎంపీటీసీలు ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com