AP: 10 నిమిషాల్లోపే అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్

ఏపీ శాసనసభ సమావేశాల నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు బహిష్కరించారు. అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఏపీ శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఈ సమయంలోనే చంద్రబాబు నవ్వడం ఆసక్తి రేకెత్తించింది. గత శాసనసభలో జరిగిన ఘటనలను టీడీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు.
వైసీపీ పాలనపై గవర్నర్ విమర్శలు
వైసీపీ పాలనపై ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ విమర్శలు చేశారు. గత ప్రభుత్వ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని తెలిపారు. వైసీపీకి ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పారని విమర్శించారు. మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలనను గాడిలో పెడుతున్నట్లు వెల్లడించారు. అన్ని అంశాల్లోనూ గత వైసీపీ ప్రభుత్వం విఫలమైందని వెల్లడించారు.
జగన్‌పై అనర్హత వేటు తప్పినట్లే..?
శాసనసభకు హాజరుకాకపోతే అనర్హత వేటు పడుతుందనే భయంతోనే జగన్ అసెంబ్లీకి హాజరయ్యారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ జగన్ ఇలా అసెంబ్లీకి వచ్చి అలా వెళ్లిపోయారు. కనీసం పది నిమిషాలు కూడా జగన్ శాసనసభలో లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. జగన్‌పై అనర్హత వేటు తప్పినట్లేనని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం: బొత్స
గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసిన అనంతరం వైసీపీ ఎమ్మెల్సీ బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. 'రాష్ట్రంలోని ఏకైక విపక్షం వైసీపీ. ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకురావాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ప్రతిపక్షం అంటేనే ప్రజల పక్షం. అదే విషయంపై సభలో కోరాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశాం.' అని బొత్స పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com