ARREST: చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అరెస్ట్‌

ARREST: చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అరెస్ట్‌
పులివర్తి నానిపై దాడి కేసులో అరెస్ట్‌ చేసిన పోలీసులు.. నిరసన తెలిపిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల పోలింగ్‌ తర్వాత రోజు అప్పటి టీడీపీ చంద్రగిరి అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగిన కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తిరుపతిలోని ఎస్వీయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్ట్రాంగ్ రూం పరిశీలించేందుకు వెళ్లిన పులివర్తి నానిపై దుండగులు దాడి చేశారు. ఈ కేసులోనే మోహిత్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. శనివారం రాత్రి మోహిత్ రెడ్డి దుబాయ్‌ వెళ్లబోతుండగా ఆయనపై లుక్ అవుట్ నోటీసులు ఉండడంతో బెంగళూరు విమానాశ్రయంలో పట్టుకున్నారు. తిరుపతి డీఎస్పీ రవిమనోహరాచారి నేతృత్వంలో బృందం ఆయన్ను అరెస్ట్‌ చేసింది. అక్కడి నుంచి ఇవాళ ఉదయం ఎస్వీయూ పోలీస్‌ స్టేషన్‌కు మెహిత్‌రెడ్డిని తరలించారు. ఈ కేసులో ఇప్పటికే 34 మందిని అరెస్టు చేశారు. అయితే, మోహిత్ రెడ్డి అరెస్టుతో ఆయన తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు.


దాడికి ప్రధాన సూత్రధారి మోహిత్‌రెడ్డి అని పేర్కొంటూ పులివర్తి నాని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరును పోలీసులు చేర్చారు. విదేశాలకు పారిపోకుండా లుక్‌అవుట్‌ నోటీసులు జారీచేశారు. శనివారం బెంగళూరు నుంచి దుబాయ్‌ వెళ్లబోతుండగా విమానాశ్రయ భద్రతా సిబ్బంది గుర్తించి, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు తిరుపతి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్లి అరెస్టు చేశారు.

మోహిత్ మీద కేసు పెట్టి భయపెట్టాలని చూశారని.. లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని . మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రశ్నించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అధికారుల సమక్షంలో ఉంటే అతని పై ఎలా కేసు పెడతారని నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. 52 రోజుల తర్వాత నానిపై దాడి కేసులో 37వ నిందితుడిగా చేర్చారని... దుబాయ్ లో స్నేహితుడి పెళ్లికి మోహిత్ రెడ్డి వెళ్తుంటే బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. దీంతో రోడ్డుపై కూర్చోని భాస్కర్ రెడ్డి, నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

ఏం జరిగిందంటే..

ఇటీవలి సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో పెద్దఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంల పరిశీలనకు వెళ్లిన చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే 34 మందిని అరెస్టుచేశారు. ఇప్పుడు మోహిత్‌రెడ్డి వంతు వచ్చింది. నానిపై నాటి వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన తనయుడు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్‌రెడ్డికి చెందిన అనుచరులు భానుకుమార్‌రెడ్డి, గణపతితోపాటు పలువురు దాడి చేశారు. మారణాయుధాలు, రాళ్లు, బీరు సీసాలతో దాడికి తెగబడ్డారు. నానితోపాటు ఆయన డ్రైవర్, గన్‌మెన్‌పై సుత్తితో విచక్షణా రహితంగా దాడిచేశారు. గన్‌మెన్‌ తేరుకుని గాల్లోకి కాల్పులు జరపగా నిందితులు పరారయ్యారు. ఘటనలో పులివర్తి నాని భుజం, కాలికి.. గన్‌మెన్‌ తలకు గాయాలయ్యాయి.

Tags

Next Story