JAGAN: జగన్ పర్యటనలో వైసీపీ నేతల బరితెగింపు

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. బంగారుపాళ్యంలో జగన్ పర్యటనపై పోలీసులు విధించిన ఆంక్షలను వైసీపీ శ్రేణులు యథేఛ్చగా ఉల్లంఘించాయి. పోలీసుల ఆంక్షలు లెక్క చేయకుండా వైసీపీ నేతలు భారీగా జన సమీకరణ చేశారు. ఎస్పీ మాటలను సైతం లెక్కచేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారు. హెలీప్యాడ్ నుంచి చెన్నై బెంగళూరు నేషనల్ హైవే మీదుగా నలగంపల్లి బ్రిడ్జి కింద నుంచి బంగారుపాళ్యం వెళ్లాల్సిన వైఎస్ జగన్.... దారి మార్చేందుకు ప్రయత్నించారు. అనుమతిచ్చిన దారిలో కాకుండా మరోవైపు వెళ్తూ బంగారుపాళ్యం గ్రామంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. పోలీసులు గమనించి ఆయన వాహన శ్రేణిని బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. గ్రామంలోకి వెళ్లేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. దీంతో జాతీయ రహదారిపైకి వచ్చిన జగన్ కారులోంచి బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేశారు. సమీకరించిన జనం కారుపైకి దూసుకొచ్చి వైఎస్ జగన్‌తో కరచాలం చేయాలని ప్రయత్నించారు. మరికొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. కారులోకి వెళ్లమని జగన్‌ను పదే పదే పోలీసులు హెచ్చరించినా మాట వినని ఆయన అభిమానులకు షేక్‌హ్యాండ్ ఇచ్చుకుంటూ ముందుకు సాగారు. చిత్తూరు, అన్నమయ్య జిల్లా ఎస్పీలు జగన్ వాహనం వద్దకు వెల్లి లోపల కూర్చోమని చెప్పారు. అయినా జగన్ పోలీసుల మాట వినలేదు.
వైసీపీ శ్రేణుల వీరంగం
మామిడి మార్కెట్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. మండీల్లోని మామిడిని తొక్కి ధ్వంసం చేశారు. పరామర్శ పేరుతో పంటను నాశనం చేయడంపై రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శివపై దాడి చేశారు. కెమెరాలో దృశ్యాలు తొలగించాలని బెదిరించడమే కాక కెమెరాను లాక్కొన్నారు. అనంతరం జగన్ రైతులతో ముచ్చటించారు. తమ ప్రభుత్వ హయాంలో కిలో మామిడి రూ.29కి కొన్నామని ఇప్పుడు కిలో మామిడికి రూ.2 కూడా ఇవ్వట్లేదని జగన్ పేర్కొన్నారు. జగన్ కాన్వాయ్ ముందుకు సాగుతున్న సమయంలో.. కొందరు కార్యకర్తలను పోలీసులు కొట్టారని వైసీపీ నేతలు ఆరోపించారు.
జగన్‌ను కారు దిగనివ్వని ఎస్పీ
తలకు గాయమైన ఓ కార్యకర్తను కలిసేందుకు జగన్.. తన కాన్వాయ్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. కారు నుంచి బయటకు వచ్చి కార్యకర్తలకు అభివాదం చేశారు. దాంతో.. ఒక్కసారిగా టెన్షన్ పెరిగింది. జగన్ కారు దిగబోతుంటే.. జిల్లా ఎస్పీ అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కారు దిగొద్దనీ, ఆంక్షలు ఉన్నాయని చెప్పారు. దాంతో హైటెన్షన్ వాతావరణం కనిపించింది. ఓ కార్యకర్తతో జగన్ మాట్లాడినట్లు తెలిసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com