YCP Leaders : ఫ్రస్ట్రేషన్‌లో బూతుల భాషలోకి దిగిపోతున్న వైసీపీ ప్రజాప్రతినిధులు

YCP Leaders :  ఫ్రస్ట్రేషన్‌లో బూతుల భాషలోకి దిగిపోతున్న వైసీపీ ప్రజాప్రతినిధులు
YCP Leaders : 3 ఏళ్ల పాలనకే జనం గగ్గోలు పెట్టేస్తూ ఎక్కడికక్కడ తిరగబడుతుండడం.. పనిగట్టుకుని బస్సు యాత్రలు చేసి సభలు ఏర్పాటు చేసినా జనం రాకపోవడం.

YCP Leaders : వైసీపీ నేతల్లో ఫ్రస్ట్రేషన్‌ పీక్స్‌కి వెళ్లిపోయింది. 3 ఏళ్ల పాలనకే జనం గగ్గోలు పెట్టేస్తూ ఎక్కడికక్కడ తిరగబడుతుండడం.. పనిగట్టుకుని బస్సు యాత్రలు చేసి సభలు ఏర్పాటు చేసినా జనం రాకపోవడం.. ఓ పక్క మహానాడు చూస్తే సూపర్ సక్సెస్ అయిపోవడంతో అధికార పార్టీ నేతలకు చెమటలు పట్టేస్తున్నాయి. ఆ ఫియర్‌.. ఫెయిల్యూర్‌.. ఫ్రస్ట్రేషన్‌.. కలిపి F-3గా మారి వాళ్లతో నోటికొచ్చినట్టు మాట్లాడిస్తున్నాయ్. MLC అని లేదు, MLA అని లేదు, మేయర్ అని లేదు.. తన్నుతా, కొడతా, అంతుచూస్తా, తేలుస్తా లాంటి భాషే తప్ప మామూలు మనుషులు మాట్లాడే మాటలేవీ ప్రజాప్రతినిధులు మాట్లాడడం లేదు. ముందు ఓసారి MLC దువ్వాడ శ్రీనివాస్‌ భాష వినండి.

ఇదీ MLCగారి వరస. టీడీపీ మహానాడుకు విపరీతమైన ప్రజాస్పందన వచ్చింది. ఒంగోలు మొత్తం జనసంద్రమైంది. ప్రజల్లో మార్పు మొదలైందని ఆ సభ చెప్పకనే చెప్పింది. ఆ మహానాడు వేదికపై TDP నేతల స్పీచ్‌లతో MLC దువ్వాడకు BP వచ్చేసింది. అచ్చెన్నాయుడుని నోటికి ఎంతొస్తే అంత తిట్టేశారు. పైగా మీసం మెలేసి మరీ నోటికి పనిచెప్పారు. ఇది జరిగి రెండ్రోజులు కాకముందే.. MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఇలాగే అసహనంతో ప్రత్యర్థుల్ని తిట్టడం మొదలెట్టారు. ఓ ప్రజాప్రతినిధిగా మాట్లాడుతున్నాననే విషయం కూడా మర్చిపోయి ఇష్టారాజ్యంగా చిందులేశారు.

ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించుకుంటూ కర్నూలు మేయర్‌ బి.వై. రామయ్య కూడా అసందర్భ ప్రేలాపనలతో రెచ్చిపోయారు. మీడియా వాళ్ల వీపులు పగలగొడతా అంటూ నోటికొచ్చిందల్లా అన్నారు. ఇంతకీ మీడియా చేసిన తప్పేంటో తెలుసా.. మొన్నటి YCP బస్సుయాత్ర సందర్భంగా సభలకు ప్రజలు పెద్దగా రాలేదని చెప్పడమట. ఆయన నోటి దురుసు కూడా ఓసారి చూడండి.

ప్రజాప్రతినిధులంటే పదిమందికీ ఆదర్శంగా ఉండాలి.. కానీ ఇప్పుడు YCP లీడర్లు చేస్తోందేంటి.. బరి తెగించి మాట్లాడడం, పబ్లిక్‌గా బెదిరించడం. అసలిదేం సంస్కారం..! రాజకీయాల్ని ఎటు తీసుకెళ్తున్నారు.. వ్యక్తిగత కక్షలతో ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించడం, దిగజారి మాట్లాడడం ఏం నీతి..! ఈ స్థాయిలో లీడర్లకు ఫ్రస్ట్రేషన్‌ రావడానికి కారణం YCP అంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుండడమే కారణమంటున్నారు విశ్లేషకులు. గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటిస్తే ప్రతిచోటా ప్రతిరోజూ నిరసన సెగలే. 'గడప తొక్కనేల.. తిట్లు తిననేల' అన్నట్టుగా తయారైంది కొందరి పరిస్థితి.

పథకాల ద్వారా డబ్బులు విచ్చలవిడిగా పంచుతున్నామని ఎంత డబ్బాలు కొట్టుకుంటున్నా.. ప్రతిదాంట్లో కోతలు విధిస్తుండడం, మౌలిక సదుపాయాలు 3 ఏళ్లుగా అత్యంత దారుణంగా మారడంతో జనంలో తిరుగుబాటు మొదలైంది. కరెంటు లేక, రోడ్లు లేక, ధరలు పెరిగిపోయి, పన్నులు మరింత భారమై, ఉపాధి లేక అల్లాడుతున్న వాళ్లంతా ఇప్పుడు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇన్నాళ్లూ YCP వేధింపులకు, పోలీస్‌ మార్క్‌ పంచాయతీలకు, కేసులకు భయపడి మౌనంగా ఉన్న వాళ్లు కూడా రోడెక్కుతున్నారు. ఇదే టైమ్‌లో.. ఒంగోలు శివారులో తెలుగుదేశం నిర్వహించిన మహానాడు గ్రాండ్ సక్సెస్ అవడం కూడా YCPకి మింగుడు పడడం లేదు. మహానాడుకు జనం రాకుండా అడుగడుగునా ఆంక్షలు పెట్టారని టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలే చేశారు. బస్సుల్ని అడ్డుకుని, గ్రామాల్లో టీడీపీ సానుభూతిపరుల్ని బెదిరించి ఇలా చేశారంటున్నారు. కానీ.. అన్నింటినీ దాటుకుని బహిరంగ సభకు లక్షలాది మంది పోటెత్తడంతో వైసీపీలో కలవరపాటు మొదలైంది.

నియోజకవర్గాల్లో అంతకంతకూ పరిస్థితులు చేజారుతుండడంతో దాన్నెలా కంట్రోల్ చేయాలో అర్థంకాక ప్రత్యర్థుల్ని నోటికొచ్చింది తిడుతూ వైసీపీ నేతలు ఆ ఫ్రస్ట్రేషన్‌ తీర్చుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. గతంలో NTR కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు చేసి జనంతో ఛీకొట్టించుకున్నారు కొందరు వైసీపీ నేతలు. వాళ్లకేమాత్రం తీసిపోము అన్నట్టుగా వారి బాటలోనే వెళ్తూ అరాచక భాషతో విరుచుకుపడుతున్నారు ఇప్పుడు కొందరు ప్రజాప్రతినిధులు. ఇకనైనా ఈ పద్ధతి మార్చుకోకపోతే ప్రజల్లో జగన్‌ పార్టీ నేతలు మరింత పలుచన కావడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story