Srungavarapukota: "శృంగవరపుకోట వైసీపీలో వార్.. మంత్రి మాటకే లెక్కలేదా?"

Srungavarapukota: శృంగవరపుకోట వైసీపీలో తారాస్థాయికి విభేదాలు. ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీగా రసవత్తర రాజకీయాలు. ఎవరికి వారే మీటింగులు, అధిష్టానంకి ఫిర్యాదులు. మంత్రి బొత్సా సమక్షంలోనే ఇరువర్గాల ఫైటింగులు. అధిష్టానంకు తలనొప్పిగా నేతల పంచాయితీలు.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వర్సెస్ ఎమ్మెల్సీ రఘురాజు అనే విధంగా ఆధిపత్య పోరు రసవత్తరంగా సాగుతోంది. పార్టీ లేనిదే మనం లేమని సీనియర్లు పదేపదే మొత్తుకుంటున్నా వీరిద్దరూ అవేవీ పట్టించుకోవడం లేదు. ప్రతీ విషయంలో నువ్వా నేనా అన్నట్టు వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారు. ఒకరిపై మరొకరు క్యాడర్ ని ఉసుగొలుపుతూ ఫిర్యాదులు చేసుకుంటున్నారు. లక్కవరపుకోటలో కొద్దిరోజుల కిందట జరిగిన వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో వర్గ విభేదాలు మరోసారి గుప్పుమన్నాయి. ఎమ్మెల్యేపై ఎమ్మెల్సీ వర్గీయులు ఎదురు తిరగడం హాట్ టాపిక్ గా మారింది.
వాస్తవానికి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకి, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుకు మధ్య ఏడాది కాలంగా వర్గపోరు నడుస్తోందట. అది పెరిగి పెరిగి.. మంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలో బరస్ట్ అయ్యిందట. ఒక వైపు స్టేజి మీద ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతుండగా మరోవైపు ఎస్ కోట మండల ఎంపీపీ సోమేశ్వర రావు, ఎమ్మెల్సీ భార్యామణి, వైస్ ఎంపీపీ ఇందుకూరి సుబ్బలక్ష్మీలు బొత్సా ఎదుటే గొడవకి దిగారట. స్టేజ్ మీదకు పిలిచినా వెళ్లలేదట. ఎమ్మెల్సీ రఘురాజు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలన్నీ వేరు... శృంగవరపుకోట నియోజకవర్గం వేరని బొత్సకే చెప్పేశారట. నియోజకవర్గంలో చిన్నచిన్న డిస్టబెన్సులు ఉన్నాయని, వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలని, కార్యకర్తలు చెప్పిన వాటిని కూడా వినాలని సభావేదిక సాక్షిగా ఎమ్మెల్సీ రఘురాజు చెప్పడంతో అక్కడ ఉన్న ఎమ్మెల్యే బిత్తర పోయారట. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య పోరు ఏ రేంజ్ లో ఉందో ఈ సీన్ తో అర్ధం చేసుకోవచ్చు.
పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితుల్లో ఎమ్మెల్యే చేసిన ఓ వ్యవహారం వర్గపోరుకు మరింత ఆజ్యం పోసిందట. ఎమ్మెల్సీ వర్గానికి తెలియకుండా నియోజకవర్గ పరిధిలోని సచివాలయాల్లో వైసీపీ కన్వీనర్లను ఎమ్మెల్యే నియమించారట. అదే తడువుగా లిస్టును అధిష్టానానికి సైతం పంపించేశారట. దీంతో చిర్రెక్కిన ఎమ్మెల్సీ వర్గం సమయం కోసం వేచి చేశారట. ఇంతలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం రావడం అక్కడ బొత్సా కూడా ఉండటంతో ఒక్కసారిగా తమలో ఉన్న ఆవేశాన్ని కట్టలు తెంచుకుని ముందు పెట్టేశారట. అయితే బొత్సా పట్టించుకోకపోవడంతో నానా హడావుడి చేశారట. దీంతో బొత్సా చేసేదేమీ లేక వారిని సముదాయించి తర్వాత విజయనగరం వచ్చి కలవాలని ఆదేశించారట. ఆరోజు వివాదం అక్కడితో సద్దుమనిగినా... తర్వాతి రోజు ఎమ్మెల్సీ క్యాడర్ అంతా విజయనగరం వెళ్లి బొత్సాను కలిసి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు చేస్తున్న వ్యవహారంపై పేజీలకు పేజీలుగా ఫిర్యాదు చేశారట.
వాస్తవానికి గత ఎన్నికల్లో స్థానికేతరుడైన కడుబండి శ్రీనివాసరావుని ఇక్కడి ఓటర్లు గెలిపించారు. అయితే తమను కాదని వేరే లీడర్ కు వైసీపీ అధిష్టానం సీటు ఇవ్వడంపై స్థానిక నాయకులు గుర్రుగా ఉన్నా... పార్టీ ఆదేశాలు మేరకు కడుబండితో కలిసి నడవాల్సి వచ్చిందట. ఇలా వర్గాలు తొలి నుంచే ఎమ్మెల్యేను వెంటాడుతున్నాయి. అయితే అందరినీ కలుపుకుపోయే స్వభావం ఎమ్మెల్యేకి లేకపోవడంతో నియోకవర్గంలో నాయకులు ఎవరికి వారే చక్రం తిప్పేపనిలో పడ్డారట. బొత్స సత్యనారాయణ వర్గీయుడైన ఎమ్మెల్సీ రఘురాజు మాత్రం ఎమ్మెల్యేకి తలలో పేనులా మారారని నియోజకవర్గంలో టాక్. ఎమ్మెల్యే కండుబండి శ్రీనివాసరావు గెలిచిన తొలి రోజుల్లో రఘురాజుని నెత్తిన పెట్టుకుని తిరిగేవారట. గెలుపు కోసం అహర్నిశలు కృషిచేసిన తన సామాజిక వర్గానికి చెందిన నాయకులను సైతం పక్కనపెట్టి.. రఘురాజుకి ప్రాధాన్యత ఇచ్చారట. పాలునీళ్లలా కలిసిపోయిన వీరిద్దరి మధ్య తర్వాతి కాలంలో జరిగిన పరిణామాలు వివాదం రాజేశాయట.
రఘురాజుకి ఎమ్మెల్సీ పదవి వచ్చాక ఆయన వ్యవహారశైలిలో మార్పు వచ్చిందటా. దీంతో ఇద్దరూ నువ్వానేనా అన్నట్టు వ్యవహరిస్తున్నారట. ప్రోటోకాల్ కోసం పాకులాడటం, వేరువేరుగా సమావేశాలు నిర్వహించడం.. పార్టీ పదవుల నియామకాల‌్లో రెండు లిస్టులు తయారు చెయ్యడం సాగుతోందట. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుని కాదని నియోజకవర్గంలో అంతాతానే అన్నట్టు వ్యవహరిస్తున్నారట ఎమ్మెల్సీ రఘురాజు. ఎమ్మెల్యేతో పని లేకుండానే కార్యక్రమాలకు హాజరై నియోజకవర్గంలో అంతా తానే అన్న సంకేతాలు ఇస్తున్నారట. దీంతో చనువిచ్చి చంకన పెట్టుకుంటే... ఏకంగా నెత్తిన కూర్చున్నాడని సహచరులతో ఎమ్మెల్యే కడుబండి చెప్పుకుంటూ తెగ బాధపడిపోతున్నారట.
ఇదిలా ఉండగా గడపగడపకు కార్యక్రమం ప్రారంభంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకి ఎమ్మెల్సీ రఘురాజు సహకరించలేదన్న టాక్ సంచలనం రేపింది. శృంగవరపుకోటలోని ఓ అక్రమ నిర్మాణం విషయంలో స్థానిక సర్పంచ్ తో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా గేమ్ ఆడిస్తున్నారన్న టాక్ వర్గపోరుకు మరింత ఆజ్యం పోసిందట. అదే సమయంలో ఎమ్మెల్యేను తిడుతూ, ఎమ్మెల్సీని పొగుడుతూ రాసిన లేఖ నియోజకవర్గంలో హల్చల్ చేసిందట. ఇలాంటి ఘటనలు తరచుగా పునరావృతం అవడంతో.. తాజా ఘటన ఆ వర్గపోరును మరింత పెంచిందని క్యాడర్ చెవులు కొరుక్కుంటోందట. మొత్తానికి ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ రాజకీయం శృంగవరపుకోటను షేక్ చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com