YCP: సాగునీటిపై ఆశలు వద్దు: అంబటి

YCP: సాగునీటిపై ఆశలు వద్దు: అంబటి
సాగర్‌ ఆయకట్టు కింద నీరిచ్చే పరిస్థితి లేదన్న అంబటి

నాగార్జునసాగర్‌ ఆయకట్టు కింద ఈ ఏడాది పంటలకు నీరిచ్చే పరిస్థితి లేదని, సాగునీటిపై ఆశలు పెట్టుకోవద్దని ఆంధ్రప్రదేశ్‌ జల వనరుల శాఖామంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చాగల్లు గ్రామంలో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. నాగార్జునసాగర్‌లో ఆశించిన మేర నీటి నిల్వలు లేవని అంబటి అన్నారు. ప్రస్తుతం సాగర్‌ కాలువకు విడుదల చేస్తున్న 5 టీఎంసీలు తాగునీటి అవసరాలకు మాత్రమే వాడుకోవాలన్నారు. ఈ సంవత్సరం వర్షాధారమే తప్ప సాగర్‌ కాలువల కింద పంటలు సాగు చేసుకునే పరిస్థితి లేదని రైతులకు పిడుగు లాంటి వార్త చెప్పారు. నీరు మనం సృష్టించేది కాదని రైతులకు చెప్పారు. దొరికితే కొనుక్కొని వచ్చి ఇవ్వటం సులువు కాదన్నారు.


రైతుల దుస్థితికి ఏపీ పాలనే కారణమని తెలుగుదేశం మండిపడుతోంది. అంబటి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కృష్ణా జలాలపై పోరాటంలో ఉద్ధృతంగా ముందుకు వెళ్లాలని చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్లు నిన్న చంద్రబాబుతో ములాఖత్‌ అయిన తెలుగుదేశం సీనియర్‌ నేత పయ్యావుల కేశవ్ తెలిపారు. జైల్లో పెట్టి చంద్రబాబు స్థైర్యాన్ని దెబ్బతీయాలన్న జగన్‌ కుట్రలు ఫలించవని, ఆయన మరింత దృఢంగా తయారయ్యారని... తెలుగుదేశం నేత పయ్యావుల కేశవ్‌ అన్నారు. ములాఖత్‌లో భాగంగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో చంద్రబాబును భువనేశ్వరి, బ్రాహ్మణి, కేశవ్‌ కలిశారు. ఈ సందర్భంగాపార్టీ పోరాట ప్రణాళిక, పనితీరు సహా వివిధ అంశాలపై సూచనలు చేశారని వెల్లడించారు.

ఏపీలో జగన్‌ పాలనపై తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ సెక్షన్లను పోలీసులు అమలు చేస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. తమపై పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తూ రాయదుర్గం పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు కాలవ శ్రీనివాసులు సిద్ధమవ్వగా పెద్దయెత్తున పోలీసులు చేరుకుని అనంతపురంలోని నివాసంలో ఆయన్ను గృహ నిర్బంధం చేశారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి శ్రీనివాసులు రాయదుర్గం వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో శ్రీనివాసులు ఇంటి మెట్ల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అధికార పార్టీ నేతలకు రక్షణగా నిలుస్తున్న పోలీసులు.. ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తున్నారని....పోలీసుల తీరుకు వ్యతిరేకంగా త్వరలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు. మరోవైపు "వై ఏపీ నీడ్స్ జగన్" ప్రచారానికి కౌంటర్‌గా "ఏపీ హేట్స్ జగన్ " పేరుతో తెలుగుదేశం ప్రచారం ప్రారంభించింది. సోషల్ మీడియాలో కూడా "ఏపీ హేట్స్ జగన్" అనే హ్యాష్ ట్యాగ్ తో ప్రచారం చేపట్టనుంది.


Tags

Read MoreRead Less
Next Story