YCP: పవన్‌ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే సస్పెండ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిసిన చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులును వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఈ మేరకు జగన్ ఆదేశాలతో సస్పెండ్ చేస్తూ.... వైసీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు వెలువరించింది. చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఈ మధ్యాహ్నం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. చిత్తూరు శాసనసభ స్థానానికి విజయానందరెడ్డిని వైకాపా సమన్వయకర్తగా ప్రకటించినప్పటి నుంచి శ్రీనివాసులు అసంతృప్తిగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన పవన్ తో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తర్వాత కొద్ది గంటల్లోనే శ్రీనివాసులుపై వైసీపీ సస్పెన్షన్ వేటువేసింది.
ఇప్పటికే NTR జిల్లా మైలవరం వైసీపీ MLA వసంత కృష్ణప్రసాద్... తెలుగుదేశంలో చేరారు. పెద్ద సంఖ్యలో తన అనుచరులతో కలిసి హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఆయన సైకిలెక్కారు. MLA కృష్ణ ప్రసాద్‌కు చంద్రబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కృష్ణ ప్రసాద్ సహా MPPలు, MPTCలు, సర్పంచ్ లు సహా అనుచరులు తెలుగుదేశంలో చేరారు. గత ఐదేళ్ల నుంచి ఏపీలో అభివృద్ధి, సంక్షేమం పూర్తిగా నిలిచిపోయిందన్న కృష్ణ ప్రసాద్... ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి పరిశ్రమలు వచ్చి యువతకు ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు పాలన అవసరమని చెప్పారు. రాజధాని విషయంలో సీఎం జగన్ మాట మార్చారన్న కృష్ణప్రసాద్ మైలవరం నియోజకవర్గానికి తగినన్ని నిధులు కేటాయించలేదన్నారు. మైలావరం అభివృద్ధి కోసమే తెలుగుదేశంలో చేరినట్లు స్పష్టం చేశారు.
జగన్ తీరు నచ్చక అనేక మందితమ పార్టీలో చేరుతున్నారన్న చంద్రబాబు నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయల్ని తెలుగుదేశంలోకి ఆహ్వానించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో "రా.. కదిలి రా" బహిరంగసభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. ఈ సందర్భంగా వైసీపీకు రాజీనామాచేసిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం-జనసేన గెలుపు ఎవ్వరూ ఆపలేరన్న ఆయన.. అవసరమైతే తొక్కుకుంటూ పోతామని వైకాపాను హెచ్చరించారు. పల్నాడులో... ఎందరో కార్యకర్తలు వైసీపీ చేతిలో బలయ్యారని.. ఆవేదన వ్యక్తంచేశారు. మంచినీళ్లు అడిగితే సామిని బాయ్ అనే గిరిజన మహిళనుట్రాక్టర్‌తో తొక్కించి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరహంతకులను వదలబోమని హెచ్చరించారు. సంపద సృష్టించి ఆదాయం పెంచడం తెలిసిన పార్టీ తమదన్న చంద్రబాబు అప్పులు చేయడం మాత్రమే తెలిసిన పార్టీ వైకాపా అని దుయ్యబట్టారు. కోవర్టులతో పవన్‌కు, తనకు మధ్య విభేదాలు సృష్టించలేరని చంద్రబాబు స్పష్టంచేశారు. నాగార్జున సాగర్ కుడికాలువ అభివృద్ధి పనులు, వరికపూడిశెల ప్రాజెక్టు పూర్తిచేసే బాధ్యత తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com