YCP: మాట తప్పనంటూనే... మళ్లీ సమన్వయకర్తల మార్పు

పాలనలోనే కాదు పార్టీ వ్యవహారాల్లోనూ రివర్స్ విధానాన్నే వైసీపీ కొనసాగిస్తోంది. గత నెల నుంచి మొదలుపెట్టిన నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుల కసరత్తులోఇప్పటి వరకు నాలుగు జాబితాలను విడుదల చేశారు. ఆ జాబితాల్లోని కొందరిని మళ్లీ ఇప్పుడు జగన్ మారుస్తున్నారు. మాట తప్పను మడమ తిప్పను అని పదే పదే ఊదరగొట్టే జగన్ ఒక్కసారి కూడా మాటమీద నిలబడింది లేదని ఆపార్టీ నేతలే ఇప్పుడు గుసగుసలాడుకుంటున్నారు. దాదాపు నెలరోజులపాటు నియోజకవర్గాల సమన్వయకర్తలను మారుస్తూ సొంత పార్టీ నేతలతో ఫుట్ బాల్ ఆడుకున్న జగన్ ఇప్పుడు జాబితాలో ఉన్న వారినీ ఉంచేలా కనిపించడం లేదు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సమన్వయకర్తగా మాచాని వెంకటేష్‌ను గతంలో ప్రకటించిన జగన్ ఇప్పుడు అక్కడ మాజీ ఎంపీ బుట్టా రేణుక పేరు ఖరారు చేశారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, బుట్టా రేణుక సీఎం జగన్‌ను గురువారం కలిశాక ఈ మార్పును ఖరారు చేశారు. వెంకటేష్‌కు నామినేటెడ్ పదవి, ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్‌మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. కర్నూలు లోక్‌సభ స్థానానికి గతంలోనే మంత్రి గుమ్మనూరు జయరాం పేరు ప్రకటించారు. ఇప్పుడు కర్నూలు మేయర్, జిల్లా వైసీపీ అధ్యక్షుడు బీవై రామయ్యను ఎంపిక చేశారు. జయరాంకు ఈ మేరకు పార్టీ ముఖ్య నేత ఒకరు సమాచారమిచ్చినట్లు సమాచారం. కర్నూలు లోక్‌సభతో పాటు ఆలూరు అసెంబ్లీ టికెట్ కూడా ఇస్తే పోటీచేస్తానని, లోక్‌సభ మాత్రమే అంటే పోటీ చేయలేనని జయరాం తేల్చిచెప్పడంతో ఈ మార్పు చేసినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.
నరసరావుపేట లోక్‌సభ ఇన్‌ఛార్జిగా నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ను, నెల్లూరు నగర సమన్వయకర్తగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో గిద్దలూరు ఎమ్మెల్యేను మార్కాపురానికి, మార్కాపురం ఎమ్మెల్యేను గిద్దలూరుకు మార్చే ప్రతిపాదనను ప్రాథమికంగా ఓకే చేశారంటున్నారు. ఐతే స్థానికేతరులను అంగీకరించేది లేదని స్థానిక నేతలు చెబుతున్నారు. దీంతో పరిస్థితిని సర్దుబాటు చేయాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి పార్టీ అధిష్ఠానం బాధ్యత అప్పగించింది. ఆయనా అంటీముట్టనట్లుగా ఉన్నట్లు తెలిసింది. సోమవారానికి మార్పులన్నీ దాదాపు పూర్తవుతాయని సీఎంఓ వర్గాలు తెలిపాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com