Andhra Pradesh: కెేబినెట్ వల్ల రగిలిన అసంతృప్త జ్వాలలను చల్లార్చే ప్రయత్నంలో జగన్‌..

YS Jagan (tv5news.in)
X

YS Jagan (tv5news.in)

Andhra Pradesh: మంత్రివర్గ విస్తరణతో రగిలిన అసంతృప్త జ్వాలలను చల్లార్చే ప్రయత్నాను సీఎం జగన్‌ ముమ్మరం చేశారు.

Andhra Pradesh: మంత్రివర్గ విస్తరణతో రగిలిన అసంతృప్త జ్వాలలను చల్లార్చే ప్రయత్నాను సీఎం జగన్‌ ముమ్మరం చేశారు. ఒక్కొక్క నేతను తాడేపల్లి పిలిపించుకుని మరీ బుజ్జగిస్తున్నారు. నిన్న మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో చర్చించారు. దాదాపు రెండున్నర గంటలపాటు ఇద్దరి భేటీ సాగింది.

కొత్త మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న సుచరితను సముదాయించి.. కేబినెట్‌కు సమాన హోదా కలిగిన ఇస్తామనే హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె కాస్త కూల్‌ అయినట్లు సమాచారం. జగన్‌తో భేటీ తర్వాత సుచరిత మీడియాతో మాట్లాడారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానంటూ తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. తాను రాజకీయాల్లో ఉంటే వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. రాజకీయాలు విరమించుకుంటే వైసీపీ కార్యకర్తగా, ఓటురుగా ఉంటానన్నారు.

ఇటు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వర్సెస్‌ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నట్లుగా పరిణామాలు మారాయి. మంగళగిరిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు వచ్చారు. సజ్జలతో పాటు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ మురుగు హనుమంతరావు కూడా వెళ్లారు. కాని, మంగళగిరి పార్టీ ఆఫీసులోనే ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం వెళ్లలేదు. సజ్జల పర్యటనలో ఎమ్మెల్యే ఆర్కే గైర్హాజరుతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మంత్రి పదవి దక్కనందుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా అసంతృప్తితో రగిలిపోతున్నట్టు వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పైకి మాత్రం మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందితే చాలు అని చెప్పుకుంటూ.. లోలోన మాత్రం మంత్రి పదవి ఇవ్వనందుకు రగిలిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. తనకు మంత్రి పదవి అక్కర్లేదని కొన్ని నెలల క్రితమే జగన్‌కు చెప్పానని ఎమ్మెల్యే ఆళ్ల ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.

కాని, అదంతా అవాస్తవమని, మంత్రి పదవిపై చివరి నిమిషం వరకు ఆళ్ల ఆశలు పెట్టుకున్నారంటూ అనుచరులు చెప్పుకుంటున్నారు. ఇక కొత్త మంత్రివర్గంపైనా బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు విమర్శలు గుప్పించారు. బీసీలకు మంత్రి పదవులు ఇవ్వడం కాదు.. ఎస్సీ, బీసీలలో ఒకరిని ముఖ్యమంత్రిని చేయాలని జగన్‌కు సవాల్‌ విసిరారు. ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవి బీసీలకు కట్టబెట్టిన ఘనత బీజేపీదేనన్నారు.

పేరుకు పదిమంది బీసీలను మంత్రులుగా చేసినంత మాత్రాన.. బీసీలందరూ ఎలా అభివృద్ధి చెందుతారో చెప్పాలన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే సీనియర్‌ నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్థసారధి, సామినేని ఉదయభానుతో వేర్వేగా సమావేశమైన జగన్‌... వారందరినీ బుజ్జగించారు. జగన్‌ హామీలు పొందటంతో వారంతా.. పార్టీలకు విధేయులమంటూ స్వరం మార్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags

Next Story