AP: జగన్ ట్వీట్‌కు లోకేశ్ కౌంటర్

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ క్లాస్ విద్యార్థులు CBSE బోర్డ్ పరీక్షలు కాకుండా SSC బోర్డ్ పరీక్షలే రాసేలా విద్యా మంత్రి నారా లోకేశ్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. తమ ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయాలను కూటమి ప్రభుత్వం ఎందుకు పక్కనపెడుతోందని ప్రశ్నించారు. ఈ ట్వీట్ కి నారా లోకేష్ స్పందించారు. విద్యా శాఖ గురించి జగన్ లెక్చర్లు ఇవ్వడం వింతగా ఉందన్నారు.
జగన్ ట్వీట్ ఏంటంటే..?
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ విద్యార్థులకు CBSE విధానాన్ని రద్దు చేయడంపై జగన్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ స్కూళ్లలో కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు చేయాలని గత వైసీపీ ప్రభుత్వం నిర్ణయించి సిలబస్ మార్చి బోధనలో మార్పులు తీసుకొచ్చినా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని రద్దు చేసిందని, ఇది సరికాదని అన్నారాయన. చంద్రబాబు పేదల వ్యతిరేకి అని దీనివల్ల మరోసారి రుజవైందని తన ట్వీట్ లో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నాడు-నేడుతో బడుల రూపు రేఖలు మార్చామని, ఇంగ్లిషు మీడియం ప్రవేశ పెట్టామని, సీబీఎస్‌ఈ, ఐబీ సిలబస్ లను ముందుచూపుతో తీసుకొచ్చామని చెప్పారు జగన్. పేద పిల్లల తలరాతలు మార్చే ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నామని, కానీ కొత్త ప్రభుత్వం ఒక్కొక్క నిర్ణయాన్ని రద్దు చేస్తోందని మండిపడ్డారు.
లోకేశ్ అదిరిపోయే కౌంటర్
జగన్ ట్వీట్ కి లోకేష్ బదులిచ్చారు. ఏం చదివారో.. ఎక్కడ చదివారో తెలియని జగన్ ఇలాంటి లెక్చర్లివ్వడం వింతగా ఉందని లోకేశ్ ఎద్దేవా చేశారు. కనీస అవగాహన లేకుండా రాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం జగన్ నిర్ణయాలు తీసుకునేవారని తన ట్వీట్ లో ఎద్దేవా చేశారు. ఆ నిర్ణయాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారాయన్నారు. CBSE విధానం ప్రవేశపెట్టినా.. పిల్లలకు పరీక్షలు రాయడానికి అవసరమైన సామర్థ్యాలు పెంచే దిశగా ప్రభుత్వం ఆలోచించలేదని, ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని అన్నారు. జగన్ నిర్ణయం వల్ల ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న 75వేల మంది టెన్త్ క్లాస్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని లోకేష్ మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com