YSRCP: జగన్‌లో ఓటమి భయం కనిపిస్తోందంటున్న రాజకీయ విశ్లేషకులు..

YSRCP: జగన్‌లో ఓటమి భయం కనిపిస్తోందంటున్న రాజకీయ విశ్లేషకులు..
YSRCP: జగన్‌లో భయం మొదలైందా? మూడేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న విషయాన్ని గమనించారా?

YSRCP: జగన్‌లో భయం మొదలైందా? మూడేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న విషయాన్ని గమనించారా? అందుకే, ప్రజల్లోకి వెళ్లాలి, జనంలో ఉండాలి అనే మాటలు మాట్లాడుతున్నారా? నిన్నటి వైసీపీ శాసనసభా పక్షం సమావేశంలో జగన్ మాట్లాడిన మాటలను రాజకీయ విశ్లేషకులు మరో కోణంలో చూస్తున్నారు. ముమ్మాటికీ జగన్‌లో కనిపించింది భయమేనని ఢంకాపథంగా చెబుతున్నారు.

అటు ప్రతిపక్షాలు కూడా జగన్‌లోని భయాన్ని గమనించామంటున్నాయి. జంగారెడ్డిగూడెం ఘటనపై జగన్‌ ఇచ్చిన సమాధానంలో ఆ భయం కనిపించిందంటున్నాయి విపక్షాలు. ఎన్నడూ వివరణే ఇవ్వని జగన్.. స్వయంగా అసెంబ్లీలో ప్రకటన చేయడమే ఇందుకు సాక్ష్యం అంటూ చెబుతున్నారు. జంగారెడ్డిగూడెం మరణాల ఘటనతో సంపూర్ణ మద్యనిషేధం హామీ మళ్లీ తెరపైకి వచ్చింది.

ఈ హామీని నెరవేర్చలేం అనే విషయం జగన్‌కు అర్ధమైపోయిందని, పైగా పిచ్చి బ్రాండ్లు, అధిక ధరల కారణంగా మద్యం విషయంలో తీవ్ర వ్యతిరేకత తప్పదనే అభిప్రాయానికి వచ్చేసినట్టు చెప్పుకుంటున్నారు. అందుకే.. ముందస్తు వ్యూహాలు, MLAలకు వార్నింగ్‌లు లాంటివి తెరపైకి వచ్చాయంటున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న విషయాన్ని జగన్‌ ఒక్కొక్కటిగా గ్రహిస్తున్నట్టే కనిపిస్తోంది.

ఇప్పటి నుంచే ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసుకోవాలని నిన్నటి YCPLP మీటింగ్‌లో చెప్పడం వెనక కారణం అదేనని విశ్లేషిస్తున్నారు. జగన్ 3 ఏళ్ల పాలన అంత గొప్పగా ఉంటే.. వచ్చే రెండేళ్లనూ పరీక్షా సమయంగా అభివర్ణించకూడదనేది మరో వాదన. ఆడుతూ పాడుతూ గెలిచే పరిస్థితే ఉండాలి తప్పితే.. సర్వే చేస్తాం, రిపోర్ట్‌ బాగుంటేనే ఎమ్మెల్యేలకు టికెట్ ఇస్తామంటే.. అది భయం కాక మరేమిటి?

ఇంటింటికీ పథకాలు వెళ్తున్నప్పుడు.. ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్లాల్సిన అవసరం ఏంటనేది మరో ప్రశ్న. పోనీ, ఎమ్మెల్యేగా గడప గడపకు వెళ్లడంలో తప్పులేదు. కాని, ఒక్కో ఎమ్మెల్యే మూడుసార్లు వెళ్లి గడప తొక్కి రావాలనడంలోనే వైసీపీలో భయం కనిపిస్తోందంటున్నారు. ఇంటింటికీ వెళ్లలేకపోతే గెలవడం కష్టం అనే మాట స్వయంగా జగన్‌ నుంచే రావడాన్ని గమనించాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

పైగా మే ఒకటి నుంచి గడప గడపకు వైసీపీ కార్యక్రమం చేపడుతున్నారు. 8 నెలల పాటు పార్టీ నేతలంతా ప్రజల్లోనే ఉండాలని చెప్పుకొచ్చారు. దీనర్థం ముందస్తుకు వెళ్లడమేనని విశ్లేషిస్తున్నారు. ఎనిమిది నెలల సుదీర్ఘ పార్టీ కార్యక్రమం తరువాత జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఎన్నికలకు వెళ్లొచ్చనే ఊహాగానాలకు ఈ 8 నెలల పార్టీ కార్యక్రమే ఉదాహరణ అని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ముందస్తుకు వెళ్తున్నారు కాబట్టే జగన్‌కు జనం, గడపలు కనిపిస్తున్నాయన్న విమర్శలొస్తున్నాయి. ఉగాది నుంచి వైసీపీ నేతలంతా జనంలోనే ఉండాలని ఆదేశించారు. ఏప్రిల్‌ నెలలోనే బూత్‌ కమిటీలను వేసుకోవాలని.. గ్రామ, మండల, జిల్లా కమిటీలు పూర్తి కావాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఏప్రిల్‌ పదో తేదీ నుంచి నెలకు పదిసార్లు వాలంటీర్లతో కలిసి గ్రామ వార్డు సచివాలయాలను సందర్శించాలని డెడ్‌లైన్‌ పెట్టారు.

ఇలా కష్టపడిన వారికి, గెలుస్తారని తేలిన వారికే టిక్కెట్లు ఇస్తామని ప్రకటించారు. అటు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపైనా జగన్ క్లారిటీ ఇచ్చారు. జూలై 8న వైఎస్‌ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా నిర్వహించే పార్టీ ప్లీనరీ తరువాత కొత్త మంత్రులు కొలువుదీరుతారని చెప్పారు. ఎలాగూ 26 కొత్త జిల్లాలు వస్తాయి కాబట్టి.. తాజా మాజీ మంత్రులకు నాలుగైదు జిల్లాలను అప్పగిస్తానని, రీజనల్‌ ఇన్‌ఛార్జ్ లేదా జిల్లా అధ్యక్ష పదవులు అప్పగిస్తామన్నారు జగన్.

ఈ వ్యవహారం మొత్తం చూస్తే.. జగన్‌ ముందస్తు ఎన్నికల ఏర్పాట్లలో ఉన్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. వచ్చే 30 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానన్న జగన్‌.. ఆ రేంజ్‌లో పాలన సాగించారా? ఎవరినీ నొప్పించకుండా పరిపాలించారా? ఈ ప్రశ్నలకు జనం నుంచి గట్టి సమాధానాలే వినిపిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఓటీఎస్ గురించే. పేదోళ్లను నానా అగచాట్లు పెట్టిన కార్యక్రమం అనడంలో సందేహమే లేదు.

ఓటీఎస్‌ పథకంతో జనాల్లో వైసీపీపై తీవ్రమైన వ్యతిరేకత పెరిగింది. తమతో బలవంతంగా పది వేలు కట్టించుకున్నారంటూ లబ్దిదారులు బోరున విలపించిన సందర్భాలు కోకొల్లలు. తీరా పదివేలు కట్టాక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లే ఇవ్వలేదని చాలా మంది గొల్లుమంటున్నారు. ఇక ఎంతో ఘనంగా, ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఇళ్ల పట్టాల కార్యక్రమం కూడా అట్టర్‌ ఫ్లాప్‌ అయిందనే అభిప్రాయం వైసీపీ నేతల నుంచే వినిపిస్తోంది.

ఇళ్లు కట్టుకోడానికి వీల్లేని ప్రదేశాల్లో స్థలాలు ఇచ్చారంటూ బలమైన విమర్శలున్నాయి. పాతిక లక్షల మందికి ఇళ్లు కట్టిస్తానన్న హామీ జగన్‌ను గట్టి దెబ్బ కొట్టచ్చంటున్నారు. ఈ మూడేళ్లలో కనీసంలో కనీసం పది లక్షల మందికైనా ఇళ్లు కట్టించి ఇవ్వాల్సింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈపాటికే ఘనంగా జరిగి ఉండాల్సింది. కాని అలా జరగలేదు. పైగా ఇల్లు కట్టుకోకపోతే స్థలం లాక్కుంటామంటూ బెదిరిస్తున్నారని లబ్దిదారులు చెబుతున్న పరిస్థితి ఉంది.

సామాన్యులకు ఇసుక అందుబాటులో లేదు. మూడేళ్లలో రోడ్లను పట్టించుకున్నదే లేదు. కాంట్రాక్టర్లకు బిల్లుల్లేవు, ఉపాధి హామీ బిల్లుల చెల్లింపుల్లేవు. వైసీపీ నేతలు అసలు ఊళ్లలో తిరిగే పరిస్థితే లేదు. కనిపిస్తే నిలదీసే పరిస్థితి మాత్రం ఉంది. అందుకే, గడప గడపకు వైసీపీ కార్యక్రమానికి ముందే బిల్లులు చెల్లిస్తామని జగన్ చెప్పుకొచ్చారు. ఇంటికే రేషన్ కార్యక్రమం బెడిసి కొట్టింది.

వీధిలో ఆటో కోసం ఎదురుచూడడం, సమయం దాటితే గ్రామ సచివాలయానికి వెళ్లి తీసుకోవాల్సి రావడంతో పేదల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. రాజధాని పోరాటంలో అమరావతి రైతుల గెలుపు మూడు జిల్లాలపై గట్టిగా ప్రభావం చూపించబోతోంది. మూడు రాజధానుల ప్రకటనతో కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైసీపీపై వ్యతిరేకత పెరిగింది.

ఈ మూడు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు ఏనాడూ అమరావతి రైతుల పక్షాన మాట్లాడకపోగా... అవమానించే రీతిలో వ్యవహరించారు. చివరికి న్యాయస్థానంలో రైతులే గెలవడంతో ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందంటున్నారు విశ్లేషకులు. వివేకా హత్య కేసు జగన్‌కు అతి పెద్ద డ్యామేజ్ అవుతుందంటున్నారు విశ్లేషకులు.

స్వయంగా వివేకా కూతురు ఫైట్ చేస్తుండడం, బాబాయ్‌ చనిపోయినప్పుడు జగన్‌ వ్యవహరించిన తీరు ఎలా ఉందో బయటపడడం, సునీతను టార్గెట్‌ చేస్తూ వైసీపీ నేతలు, అధికారిక మీడియా దాడి చేయడం.. ఇవన్నీ సెన్సేషన్ సృష్టించాయి. ఇంటి సభ్యులు, అయినవారి చేతుల్లోనే వివేకా చనిపోయారని కడప జిల్లా వాసులకు అర్థమైపోవడంతో అక్కడ డ్యామేజీ ఖాయం అనే అభిప్రాయం ఉంది. వివేకానందరెడ్డి హత్య కేసు ప్రభావం రాయలసీమ వ్యాప్తంగా ఉంటుందంటున్నారు.

దళితులపై దాడులు, టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులపై కక్షసాధింపులను ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. చివరికి వైసీపీ కార్యకర్తలే జగన్ పాలనాతీరుతో ఇబ్బందిపడ్డారు. ఈ విషయం జగన్‌ వరకు వెళ్లి ఉండకపోవచ్చు గాని.. వైసీపీకి ఓటు వేసి సరిదిద్దుకోలేని తప్పు చేశాం అంటూ బాహాటంగానే తమ నిరసన తెలిపారు. పైగా ఈ మూడేళ్లలో ఏ ఒక్క నేత కూడా కార్యకర్తలను పట్టించుకోలేదన్న అపవాదు ఉంది.

జగన్‌ అధికారంలోకి రావడం కోసం గత ఎన్నికల్లో కార్యకర్తలు చాలా కష్టపడ్డారు. కాని, అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా పట్టించుకోలేదు. దీంతో గతంలో మాదిరిగా ఈసారి కార్యకర్తలు కష్టపడకపోవచ్చన్న అభిప్రాయం ఉంది. మొత్తంగా.. వచ్చే ఎన్నికల్లో గెలుపు కత్తి మీద సామే అని జగన్‌కు అర్ధమైంది.

Tags

Read MoreRead Less
Next Story