YS Jagan: రాజధాని ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్: వైఎస్ జగన్

YS Jagan: రాజధాని ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్: వైఎస్ జగన్
YS Jagan: మూడు రాజధానుల ఏర్పాటుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మరోసారి సీఎం జగన్ స్పష్టంచేశారు.

YS Jagan: మూడు రాజధానుల ఏర్పాటుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మరోసారి సీఎం జగన్ స్పష్టంచేశారు. అసెంబ్లీలో వికేంద్రీకరణపై జరిగిన చర్చలో సుధీర్ఘంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానమని తేల్చిచెప్పారు. రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాట్లాడిప సీఎం జగన్.. ధర్మాసనం తమ పరిధి దాటిందని చెప్పారు. రాజ్యాంగాన్ని, రాష్ట్ర అధికారాలను ప్రశ్నించేలా హైకోర్టు తీర్పు ఉందన్నారు.

ఇది దేశ సమాఖ్యస్ఫూర్తికి, శాసనసభ సర్వాధికారాలను హరించేలా ఉన్నాయని చెప్పారు. అసలు చట్టాన్నే వెనక్కి తీసుకున్నాం.. అయినా దానిపై తీర్పు ఇవ్వడమేంటి అని ప్రశ్నించారు. రాజధాని ఏర్పాటులో కేంద్రం పాత్ర ఉండదని.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అన్నారు. ఏ వ్యవస్థ అయినా వాటి పరిధిలోనే ఉండాలన్న సీఎం జగన్.. చట్టాలు చేసే అధికారం శాసనసభకే ఉందని స్పష్టంచేశారు.

రాజధాని విషయంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపైనా సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. రాజధాని నిర్మాణంలో భాగంగా రోడ్లు, డ్రైనేజీలు, నీటి సరఫరా, విద్యుత్ వంటి కనీస సౌకర్యాల కోసమే 54 వేల ఎకరాలు, లక్షా 9 వేల కోట్ల అంచనా వేశారని జగన్ తెలిపారు. చంద్రబాబు హయాంలో రాజధానిపై మూడేళ్ల కాలంలో 5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు.

చంద్రబాబుకు ఈ ప్రాంతంపై ప్రేమ ఉంటే రాజధానిని విజయవాడ, గుంటూరులో పెట్టి ఉండేవారని విమర్శించారు సీఎం జగన్. వికేంద్రీకరణ ప్రక్రియను కొలిక్కి తీసుకురావడంతో పాటు రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతుల ప్రయోజనాలు కాపాడతామని, వారికి అండగా ఉంటామని సీఎం జగన్ చెప్పారు. ప్రాథమిక హక్కులపై రాజ్యాంగంలో స్పష్టత ఉందని.. రాజ్యాంగం ఆధారంగానే పాలన సాగుతోందన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు.

జిల్లాల తలసరి ఆదాయాలు చూస్తే అసమానతలు ఎక్కువగా ఉన్నాయని... ప్రతి ప్రాంతాన్ని సమానంగా చూడాలన్నదే తమ ఉద్దేశ్యమని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టంచేశారు. ఇక మూడు రాజధానుల విషయంలో హైకోర్టు తీర్పుపై వైసీపీ ఎమ్మెల్యే ధర్మన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యల చేశారు. హైకోర్టు తీర్పు తర్వాత సభానాయకుడికి లేఖ రాశానని.. న్యాయ నిపులతో కూడా చర్చించామని తెలిపారు.

శాసన సభ బాధ్యతలను కట్టడి చేసే విధంగా హైకోర్టు తీర్పు ఉందన్నారు. శాసన, కార్య, న్యాయ వ్యవస్థలకు వాటి విధులపై స్పష్టత ఉండాలన్న ధర్మాన ప్రసాదరావు.. కోర్టు తీర్పులు శాసనసభలపై ప్రభావం పడకూడదని చెప్పారు. ఒకరి వ్యవస్థలో మరొకరు జోక్యం చేసుకోకూడదని పరోక్షంగా హైకోర్టును ఉద్దేశించి స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఉండగా.. ఈమధ్య కోర్టు తీర్పులు దుర్వినియోగం అవుతున్నాయంటూ మంత్రి పార్థసారధి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏదిఏమైనా రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం జగన్ సహా మంత్రులు చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. రాజధాని అమరావతిని అభివృద్ధి చేయలేక చేతులేత్తేసి మూడు రాజధానులు, వికేంద్రీకరణ అంటూ వితండవాదం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్ష నేతగా ఎన్నికల ముందు.. అసెంబ్లీలో రాజధాని అమరావతిపై జగన్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకోవాలని అమరావతి రైతులు సహా రాష్ట్ర ప్రజలు అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story