APPCC: ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా షర్మిల

APPCC: ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా షర్మిల
ఏపీ కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త జోష్‌.... కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో శాశ్వత ఆహ్వానితుడిగా గిడుగు రుద్రరాజు

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా YSషర్మిల నియమితులయ్యారు. తక్షణమే ఈ నియామకం అమల్లోకి వస్తుందని AICC ఉత్తర్వులిచ్చింది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగిన వైఎస్ షర్మిల.. ఇటీవల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. YS షర్మిల కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి పీసీసీ అధ్యక్షురాలిగా నియమతులవుతారని ప్రచారం జరిగింది. పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న గిడుగు రుద్రరాజును ఉన్నపళంగా సోమవారం రాజీనామా చేయించి.. వైఎస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నియమించారు.


వైఎస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలిగా నియమిస్తూ ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు ఇచ్చారు. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి గిడుగు రుద్రరాజును ఉన్నపళంగా తొలిగించడం ద్వారా ఏపీ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని భావించిన కాంగ్రెస్ అధిష్ఠానం... ఆయనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో శాశ్వత ఆహ్వానితుడిగా నియమించింది. ఈ మేరకు ఇరువురు నేతల నియామకానికి సంబంధించి కాంగ్రెస్ అధిష్ఠానం ఉత్తర్వులు ఇచ్చింది. అవి తక్షణమే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. A.P.P.C.C. అధ్యక్షురాలిగా షర్మిలను నియమించడంపై A.P.P.C.C. వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మ, కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. షర్మిల నియామకం ఏపీలో హస్తం పార్టీ బలపేతానికి దోహదం చేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.


ఏపీ కాంగ్రెస్‌లోఇప్పటికే నలుగురు కార్యనిర్వహక అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. సుంకర పద్మశ్రీ, మస్తాన్ వలి, జంగా గౌతమ్ , రాకేష్ రెడ్డిలు పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ A.P.P.C.C. అధ్యక్షురాలిగా షర్మిలను నియమించడంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరుగుతుందని అధిష్ఠానం అంచనా వేస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన బలం చేకూరుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

A.P.P.C.C. అధ్యక్షురాలిగా నియమించడంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. పార్టీ పెద్దలు, సీనియర్లతో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. . ‘‘పీసీసీ అధ్యక్షురాలి పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాష్ట్రంలో పార్టీ పునరుద్ధరణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా. రాష్ట్రంలో పార్టీకి గత వైభవం తీసుకొచ్చేందుకు పెద్దలు, సీనియర్లతో కలిసి చిత్తశుద్ధితో పనిచేస్తా’’ అని ఎక్స్‌ లో షర్మిల పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story