SHARMILA: జగన్‌ ఇంత నీచానికి ఒడిగడతారా..?

జగన్‌పై వైఎస్‌ షర్మిల ఘాటు విమర్శలు... బాలీవుడ్ నటి కాదంబరీ జెత్వానీ ఘటనపై విస్మయం

ఏపీలో తీవ్ర దుమారం రేపిన బాలీవుడ్ నటి కాదంబరీ జెత్వాని అంశంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు.. నాటి సీఎం జగన్పై పదునైన వాఖ్యలు చేశారు. జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంలో గత సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 'జగన్‌ ఇంత నీచానికి ఒడిగడుతారా?' అని విస్మయం వ్యక్తం చేశారు. ఆమెను వేధించడం దారుణం. 'ముంబై నటి కాదంబరి జైత్వాల్‌ను ఎలా కట్టడి చేయాలో సజ్జన్ జిందాల్, జగన్ ప్లాన్ చేశారు. ఇంత నీచానికి ఒడిగట్టడం దుర్మార్గం. ఒక మహిళను అడ్డుకోవడానికి ఎన్నో ప్లానులు వేయడం నీచం అని వాపోయారు.

'వైద్యురాలైన కాదంబరి జైత్వాల్‌ను మానసికంగా వేదనకు గురిచేశారు. సినీ పరిశ్రమలోకి వచ్చి ఎదగాలని భావించిన మహిళను మానసికంగా వేధించారు. ఆమె కుటుంబాన్ని టార్చర్ పెట్టారు. కేసు పెట్టాలని చూసిన ఆమెను తొక్కి పడేశారు. కాదంబరి జైత్వాల్ సామాన్యురాలైతే రూ.వంద కోట్లు ఇచ్చి నొక్కి పెట్టేసేవారు. కానీ ఉన్నతమైన కుటుంబం కావడంతో ఇక్కడకు తీసుకొచ్చి అరెస్ట్‌ చేశారు. 15 మంది ఆఫీసర్లు, పోలీసులు విమానంలో ముంబైకి వెళ్లి ఆమెను అరెస్ట్ చేసి తీసుకురావాల్సిన అవసరమేమిటి. వారిని జైలులో పెట్టి ఎంతో దారుణంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారు. నాటి సీఎం జగన్‌కు తెలియకుండానే అప్పటి ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు వ్యవహరిస్తారా? కాదంబరి అక్రమ అరెస్ట్ వెనుక చాలా మంది పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు.

ఇంత దిగజారుతారని అనుకోలేదు..

మీకు తెలియకుండా సమాజంలోని పెద్ద మనిషి పారిశ్రామిక వేత్త సజ్జన్ జిందాల్‌కు సాయం చేశారా? సజ్జన్ జిందాల్‌కు మీకు ఉన్న సన్నిహిత సంబంధాల గురించి ఆయనే చెబుతున్నారు. మీ మధ్య స్నేహంతో ఇంత దారుణంగా దిగజారుతారని ఊహించలేదు అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో వైఎస్ జగన్ మాట్లాడుతూ ఓ సందర్భంలో నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారికి అన్యాయం జరిగితే ఎలా ఉంటుందో అని చెప్పిన వాడు. జైత్వాల్‌కు జరిగిన అన్యాయంపై ఎందుకు ఆలోచించలేదు. ఫోర్జరీ కేసులో 15 మంది ముంబై వెళ్లి ఓ అమ్మాయిని అరెస్ట్ చేస్తారా? అని ఆమె ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన షర్మిల..జెత్వానికి తాను అండగా ఉంటూ పోరాటం చేస్తానన్నారు.

Tags

Next Story